Monday, July 8, 2024

AP: చిత్తూరులో… మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లు టీడీపీలో చేరిక…

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు : చిత్తూరు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సొంత జిల్లాలో వైసీపీకి చెందిన చిత్తూరు కార్పొరేషన్ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, మరి కొంత మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వారిని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలతలు పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

చిత్తూరు కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 46 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇందులో చాలా వరకు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలతో టీడీపీ నాయకులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్లు వేసిన వారిని నయాన, భయానా బెదిరించి ఉపసంహరించుకునే విధంగా చేశారు. ఫలితంగా ముగ్గురు మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ ఎన్నికయ్యారు. వైసీపీకి సూపర్ డూపర్ మెజారిటీ రావడంతో ఆముద కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ పార్టీ ప్రకటించింది. గతంలో చిత్తూర్ కార్పొరేషన్ వ్యవహారాలతో పాటు పార్టీని, ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపారు. ఆయన కనుసన్నల్లోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు పనిచేశారు.

వైసీపీ ఓడిపోవడంతో జిల్లాలో ఆ పార్టీకి నాయకత్వ లేమి ఏర్పడింది. పార్టీని ముందుకు నడిపే పెద్దదిక్కు లేకుండా పోయింది. పెద్దిరెడ్డి కట్టడి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి సైతం టీడీపీ నాయకులు అంగీకరించలేదు. అడ్డుపడుతున్నారు. దీంతో రెండుసార్లు పెద్దిరెడ్డి తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అలాగే తిరుపతిలో ఆయన ఒక వీధిని అక్రమించారని జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వైసీపీకి సారథ్యం వహించే నేత కరువయ్యారు.

- Advertisement -

దీంతో వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. పది రోజులకు ముందు పుంగనూరుకు చెందిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డిని కలిసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలో చేరే ప్రజాప్రతినిధుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో పుంగనూరులో చేరికలను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. చిత్తూరులో మాత్రం టీడీపీలో చేరిన మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లను టీడీపీ నాయకులు కండువా చేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement