Tuesday, November 26, 2024

త్వరలో కృష్ణా బోర్డు కీలక భేటీ.. రెండు రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ

అమరావతి, ఆంధ్రప్రభ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాలు, జలవిద్యుదుత్పత్తిపై ఏపీ, తెలంగాణల నుంచి పరస్పర ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్వరలో కీలక భేటీ నిర్వహించనుంది. ఈ భేటీలో గతంలో రిజర్వాయర్‌ మేనేజింగ్‌ కమిటీ (ఆర్‌ఎంసీ)లో తీసుకున్న నిర్ణయాల అమలుతో పాటు ఇపుడిపుడే జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల కేటాయింపులపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది.

ఇటీవల ఏపీ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు వరుస ఫిర్యాదులు చేశారు. ప్రత్యేకించి అనుమతి లేకుండా శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్‌ పనులు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ పనులపై నేషనల్‌ గ్రీన్‌ -టైబ్యునల్‌ ఆదేశాలున్నా ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయటం లేదనీ, శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్‌ వెలుపలకు నీటిని తరలించేందుకు కాల్వల సామర్ద్యాన్ని పెంచుతున్నారని ఫిర్యాదు చేశారు.

దీనిపై ఏపీ కూడా ఘాటుగానే స్పందించింది. స్థిరీకరించిన ఆయకట్టుకు సక్రమంగా నీరందించేందుకు చేపడుతున్న మరమ్మతులపై ఫిర్యాదు చేయటాన్ని తప్పు పట్టింది. శ్రీశైలం చుక్కనీరు లేకుండా విద్యుదుత్పత్తికి తరలిస్తున్నారు. శ్రీశైలం నుంచి 850 అడుగుల దిగువ నుంచే నీటిని తోడేస్తూ విద్యుదుత్పత్తి చేయటం వల్ల జలాశయం అడుగంటిందనీ, ఖరీప్‌కు నీళ్ళివ్వలేకపోవటంతో ప్రధానమైన సాగర్‌ ఆయకట్టు కూడా బీడువారి పోతుందని ఆరోపిస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించనున్న కీలక భేటీలో నీటి వాటాలు, కేటాయింపులు, విద్యుదుత్పత్తి.. నిబంధనలు, నియామావళితో కూడిన రూల్‌ కర్వ్స్‌ ఖరారుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

విద్యుదుత్పత్తి నియంత్రణకు ఏపీ పట్టు

శ్రీశైలం జలాశయం డెడ్‌ స్టోరేజికి చేరువైన సమయంలో, ఎగువ నుంచి వరదలు కూడా లేని సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి చేయటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఏపీ ఆరోపిస్తోంది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నియంత్రణపై విధివిధానాలు రూపొందించటంతో పాటు- వాటి అమలుకు ప్రోటోకాల్‌ పాటించాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది. వరద జలాల లెక్కల విషయంలోనూ ఏపీ అధికారులు తమ వాదన బలంగా వినిపిస్తున్నారు. బచావత్‌ -టైబ్యునల్‌ అవార్డు ప్రకారం కృష్ణాకు దిగువన ఉన్న ఏపీకి వరదల రూపంలో సముంద్రంలో కలిసే మిగులు జలాలపై సంపూర్ణ హక్కులున్న సంగతిని గుర్తు చేస్తోంది.

కృష్ణాలో నికర జలాల పంపిణీ అంశంలో మిగులు జలాల ప్రస్తావనకు అవకాశమే లేదని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ కూడా కృష్ణా జలాలను ఏపీ బేసిన్‌ అవతలకు తరలిస్తోందని ఆరోపిస్తోంది. గాలేరి-నగరి నుంచి హంద్రీనావాకు నీటి తరలిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తోంది. అనుమతుల్లేని ప్రాజెక్టులకూ, అందులోనూ కృష్ణా బేసిన్‌ తో సంబంధంలేని ప్రాంతాలకు నీటిని తరలించే విషయంలో ఆర్‌ఎంసీ విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న కృష్ణా బోర్డు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement