Tuesday, November 19, 2024

మంత్రి వర్గంలో బీసీలకు ఇంపార్టెన్స్​.. ఎవరెవరనేది ఇంకా ఫైనల్​ కాలే: స‌జ్జ‌ల‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నూతన కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్‌, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే.

మంత్రి వర్గం కూర్పుపై కసరత్తు..
కొత్త మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్ ఫైనలైజ్​ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్‌ చర్చించారు. ఈనెల 11న ఉదయం 11గంటల 31 నిమిషాలకు మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది. అదివారం సాయంత్రానికి కానీ అధికారికంగా కొత్త మంత్రులకు లేఖలు వెళ్లవొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత వ్యక్తిగతంగా సీఎంవో నుంచి అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. పాత కేబినెట్‌లో 8 నుంచి 10 మంది వరకూ కొనసాగే చాన్సెస్​ ఉన్నట్టు తెలుస్తోంది. కుల సమీకరణలు, కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకుని మిగతా వారిని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. మంత్రుల ప్రమాణ స్వీకారానికి అతిథులకు అధికారులు ఆహ్వానాలు పంపుతున్నారు.

పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు
ఏప్రిల్‌ 11న ఏపీ మంత్రివర్గం పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో పాత, కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తేనీటి విందులో పాల్గొననున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేశారు.

ఇక.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతన కేబినెట్‌ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుందని, అన్ని అంశాలను సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పాత, కొత్త కలయికతో కేబినెట్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కసరత్తు కొనసాగుతుందని తెలిపారు. కాబోయే మంత్రులకు ఆదివారం ఫోన్‌ ద్వారా సమాచారం తెలియజేస్తామన్నారు. కేబినెట్‌లో బీసీలకు, మహిళలకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. రాజీనామాలు అందరివీ గవర్నర్ వద్దకు వెళ్తాయని, మళ్లీ కొత్తగా ప్రమాణ స్వీకారం ఉంటుందని సజ్జల తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సీఎం జగన్ తో సమావేశమైన సజ్జల శనివారం మరోసారి భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement