రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా దీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని సమస్యలపై మంత్రి లోకేష్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కళాశాలల్లో డ్రగ్స్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఇందుకోసం నోడల్ అధికారుల నియామకం అంశాన్ని పరిశీలించాలని, డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా 3220 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి… న్యాయపరమైన చిక్కులను తొలగించి భర్తీకి కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిభ ఆధారిత నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని… గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా సంస్థల్లోనే ఉండిపోయాయని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యాశాఖ ఇన్‌ఛార్జ్ చైర్మన్ రామ్‌మోహన్‌రావు, సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు బి.నవ్య పాల్గొన్నారు.