అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షౌభ నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారని, పంటలు దెబ్బ తింటున్నాయని, అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆ పార్టీ రాష్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్‌ప్లాంట్‌కు అవసరమైన, నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకుండా, పూర్తి సామర్థంతో నడపకుండా నష్టాల్లోకి వెళ్ళేట్లు చేసిందని, మెయింటెనెన్సుకు డబ్బు కేటాయించకపోవడంతో తరచూ ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. సరిచేయాల్సిన రాష్ట్ర మంత్రులు అనవసరంగా జోక్యం చేసుకొని కాంట్రాక్టర్ల అవినీతికి తోడ్పడుతున్నారని, ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సంస్థను నష్టాల్లోకి నెట్టి ప్రయివేటు పరం చేయాలని చూస్తోందన్నారు. 1600 మెగావాట్ల సామర్ధం కలిగిన ఈ ప్లాంటు మూలన పడడమే ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ఒక ముఖ్య కారణమని, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలన్నారు.
బొగ్గు సరఫరా, అదనపు విద్యుత్ కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణా సామర్థ్యం పెంచటానికి, ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని లేఖలో డిమాండు చేశారు. పూర్తిసామర్థ్యంతో ఏపి జెన్‌కోలో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వరంగంలోనే కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.