ఒంగోలు, ప్రభన్యూస్ : జిల్లాలో విచ్చల విడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. భూములు ఖాళీగా కనిపిస్తే చాలు రియల్టర్లు కన్నేస్తున్నారు. పంట భూములను సైతం వదిలి పెట్టడం లేదు. కానీ వీటన్నిటికీ అనుమతులు ఉన్నాయా..? అంటే అవేమీ ఉండవు. రాత్రికి రాత్రే ప్లాట్లుగా విభజించి విక్రయాలకు తెరలేపి… కొనుగోలు దారులకు అంటగడుతున్నారు. తీరా రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్లాక అవి అనధికార ప్లాట్లని తేలుతుండటంతో విక్రయదారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల యర్రగొండపాలెంలో ఇదే జరిగింది. ప్రభుత్వ భూముల్లో సైతం ప్లాట్లు వేయడంతో… వ్యాపారి అచ్యుత ఆదినారాయణ హైకోర్టులో పిటీషన్ వేశారనే కక్షతో అతన్ని హత్య చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రియల్టర్లు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. కొత్తగా లే అవుట్ వేయాలంటే ముందుగా డీటీసీపీ లేదా, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ (ఒడా) నుంచి అనుమతి తీసుకోవాలి. అంతకంటే ముందు వ్యవసాయ భూమిని నిర్దేశిత రుసుము చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసుకోవాలి. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ల కోసం తెచ్చిన జీవో నెం.145 ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకోవడం లేదు.
ఈ నిబంధనలు పాటించాలి..
కొత్తగా లే అవుట్ వేయాలంటే ముందుగా డీటీసీపీ లేదా, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ (ఒడా) నుంచి అనుమతి తీసుకోవాలి. అంతకంటే ముందు వ్యవసాయ భూమిని నిర్దేశిత రుసుము చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసుకోవాలి. 25 శాతం మేర రోడ్లు వేసి మొక్కలు నాటాలి. కాలువలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. ఇలా అయితే గిట్టుబాటు కాదని రియల్టర్లు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేయకూడదు. కానీ, జిల్లాలో ఎక్కడా దీనిని పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వ జీవోను పట్టించుకోని రియల్టర్లు.!
రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ల కోసం తెచ్చిన జీవో నెం.145 ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎవరైనా లే అవుట్ వేయాలనుకుంటే ఎకరం స్థలంలో 5శాతం జగనన్న ఇళ్లకు ఇవ్వాలి. అందులో ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టిస్తుందట. ఒక వేల లే అవుట్ యజమాని అందులో స్థలం ఇవ్వడానికి ఇష్టం లేకపోతే దానికి మూడు కిలోమీట ర్ల దూరంలో అంత స్థలం కొనివ్వాలి. అది కూడా ఇవ్వకపోతే ఆ లే అవుట్ స్థలం మార్కెట్ విలువను బట్టి 5శాతం స్థలానికి ఖరీదు కట్టి, ఎంత డబ్బు అవుతుందో అంతా ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే చివరకు మూడోదే సాధ్యం చేసేటట్టు ఉంటుంది. కానీ జిల్లాలో ఈ నిబంధనలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అధికారులు కూడా ప్రభుత్వ జీవో పై దృష్టి పెట్టకపోవడంతో రియల్టర్లు తమ ఇష్టానుసారంగా ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి అక్రమ వెంచర్ల పై కొరడా ఝులిపించి కొనుగోలు దారులు మోసపోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్ర జలు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..