కర్నూలు (ప్రభన్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వెలసిన వెంచర్లపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్ల సర్వే నంబర్లను బ్లాక్‌లిస్టులో ఉంచాలని ఆదేశాలు రావడంతో రెవెన్యూ, మండల పరిషత్, అధికారులు కలిసికట్టుగా అక్రమ వెంచర్లపై కొరడాలు ఝులిపిస్తున్నారు. ఇప్పటికే ఆత్మకూరు, గూడూరు, ఆదోని, డోన్, కర్నూలు, నందికొట్కూరు, నంద్యాల, బేతంచెర్ల మండలాల్లో 159.49 ఎకరాలను బ్లాక్‌లిస్టులో ఉంచారు. నిబంధనల ప్రకారం వెంచర్ వేయాలంటే ప్రజా ప్రయోజనార్థం 10 సెంట్ల స్థలాన్ని కేటాయించాలి. ఆ స్థలంలో 34 అడుగుల రహదారి ఉండాలి. వ్యవసాయ భూములను భూ బదలాయింపు చేసుకోవడం తప్పనిసరి.
ఈ నిబంధనల ప్రకారం అన్ని జరిగితే చలానాలు, రుసుముల రూపంలో పురపాలకాలకు భారీగా ఆదాయం వస్తుంది. జిల్లాలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో అక్రమంగా చాలా చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేశారు. వాటిని సరిదిద్దుకునేందుకు క్రమబద్దీకరణ పేరుతో ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంచర్లు యజమానులు ఎవ్వరూ సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రస్తుతం అక్రమ వెంచర్లను బ్లాక్‌లిస్టులో ఉంచడంతో వాటిని కొనుగోలుచేసిన వారంతా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో లబోదిబోమంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital