Thursday, November 21, 2024

ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు

కర్నూలు, (ప్రభన్యూస్‌) : జిల్లాలో ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టి విలువైన సంపదను కొల్లగొడుతున్నారు. రాత్రివేళల్లో ఖనిజాన్ని యథేచ్చగా తరలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోని డోన్‌, ప్యాపిలి ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వకాలు జరిపి నిత్యం 50 టన్నుల వరకు తరలించి రూ.5లక్షల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తూ మామూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూమిని లక్ష్యంగా చేసుకుంటూ కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో తవ్వకాలు జరుపుతున్నారు. ముందుగా కొండ ప్రాంతాల్లో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టి అనంతరం మరో ప్రాంతంలో నిల్వ చేసి అక్కడి నుండి హైదరాబాద్‌, బళ్లారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

ఒక్క ప్యాపిలి మండలం నుండే దాదాపు 70 టన్నుల వరకు నిత్యం తరలిస్తుండటం గమనార్హం. దీంతో పాటు డోన్‌ ప్రాంతాల్లో కూడా యథేచ్ఛగా అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయి. ప్యాపిలి మండలంలోని మెట్టుపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమిలోనే త్రవ్వకాలు జరుపుతున్నారు. దీంతో పాటు చిగురుమాను మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే డోన్‌, ప్యాపిలి మండలాల్లో గ్రావెల్‌ తౖవ్వకాలు సైతం తవ్వుతూ వెంచర్లకు తీసుకెళుతున్నారు. ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు రాత్రివేళల్లో తరలిస్తున్నారు.

జిల్లాలో ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు కొల్లగొడుతున్నప్పటికీ అధికారులు మౌనంగా ఉండటానికి కారణం జిల్లా డీడీ కార్యాలయంలో ఓ ఉద్యోగి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆ ఉద్యోగికి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే ఒక కీలకమైన అధికారి వద్ద ఉన్న చిరు ఉద్యోగి అండదండలు ఉండటంతో జిల్లాలో కోట్లాది రూపాయల ఖనిజ సంపదను అక్రమార్కులు కొల్లగొడు తున్నారు. గత ఐదేళ్లుగా ఆ ఉద్యోగి ఆడిందే ఆటగా, ఆయన కనుసన్నలలోనే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగే ఉన్నతాధికారులకు నెల మామూళ్లు అందించారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఉన్నతాధికారులకు అనుమతులు ఉన్న ఖనిజ సంపద వివరాలను మాత్రమే నివేదికలో చూపుతూ అక్రమ ఖనిజ సంపద వివరాలు లేవన్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు చూపుతూ మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఖనిజ సంపదను కాపాడి అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement