Friday, November 22, 2024

AP: జగన్ పై గెలవాలంటే జతగా పనిచేయాల్సిందే : నాగబాబు హితవు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : “మన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుందని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలి ” అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హితవు చెప్పారు. తిరుపతిలో ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా జనసేన కార్యకర్తలతో రెండురోజుల ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.. తొలిరోజు ఆయన తిరుపతి, శ్రీకాళహస్తి నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడుతూ… కలిసికట్టుగా పనిచేస్తేనే జగన్ ను ఎదుర్కోగలమని, టిడిపి నాయకులను, కార్యకర్తలను మన అధ్యక్షులు చెప్పినట్టు గౌరవించడం మన బాధ్యత అని వివరించారు. రాబోయేది జనసేన టిడిపి ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేస్తూ పది సంవత్సరాలు వేచి ఉన్న కార్యకర్తలు ఎక్కడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించండన్నారు. మీకు మంచి భవిష్యత్తు మునుముందు రానుందని గుర్తుపెట్టుకోవాలన్నారు.


ధర్మో రక్షిత రక్షితః పవన్ కళ్యాణ్ సిద్ధాంతం అయితే.. ధనమో రక్షిత రక్షితః జగన్ సిద్ధాంతమని అన్నారు. వ్యవస్థలను పోలీసు అధికారులను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట.. పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా అధికారులకు ఆరు నెలలు సమయం ఇస్తున్నాం.. వారు పద్ధతులను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో భూకబ్జాలు, రౌడీయిజ దౌర్జన్యాలు, ఎక్కువై పోయాయని అంటూ .. మరొకసారి జగన్ ప్రభుత్వం వస్తే మన ఇంటి పత్రాలను కూడా జగన్ తాకట్టు పెట్టుకుంటాడన్నారు.. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడాలని, జనసేన, టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని, పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా మనందరం కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు.. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి అజయ్ కుమార్, ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ శశిధర్, జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, శ్రీకాళహస్తి ఇన్చార్జి వినీతకోట, రీజినల్ కో ఆర్డినేటర్ వనజ, కీర్తన, రాష్ట్ర, జిల్లా, పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement