బాబు మేనిఫెస్టో పెద్ద మోసం
కనీసం మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేదు
ప్రధానినే మోసం చేయడంలో దిట్ట
తోడేళ్ల గుంపు మాటలు నమ్మోద్దు
పాయకరావుపేట – మీరు వేసే ఓటు పేదల భవిష్యత్ నిర్ణయిస్తుందని, అందుకే అందరూ ఆలోచించి ఓటు వేయండని సూచించారు సీఎం జగన్. ఎపిలోని అనకాపల్లి జిల్లాలోని పాయకరావు పేటలో నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడమేనన్నారు. విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయడానికి మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు. అవ్వ, తాతలకు ఇంటి వద్దనే పెన్షన్ అందించడం విప్లవం.. అవునా..? కాదా అని ప్రశ్నించారు. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అందుకే చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తుందని తెలిపారు. పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం, డిజిటల్ బోధన, 93శాతం పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ కల్పించామని తెలిపారు. అమ్మఒడి పథకం ఎప్పుడైనా ఇచ్చారా..? రైతు భరోసా ఎప్పుడైనా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. రైతన్నలకు పగటిపూట 9గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ కల్పించామన్నారు. 59నెలల మీ జగన్ పాలనలోనే ఇవన్ని విప్లవాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతీ పేదకు అండగా నిలుస్తూ.. పేదవాడు అప్పుల పాలు కావద్దని ఆరోగ్య శ్రీని విస్తరించామని తెలిపారు.
చంద్రబాబు మోసం.. ఆయనే మేనిఫోస్టో కూడా మోసమే …
చంద్రబాబు నాయుడి మేనిఫెస్టో మాయలు, మోసాలతో నిండి ఉంటాయని 2014 మేనిఫెస్టో రుజువు చేసింది. ఆయన విశ్వసనీయతను, సాధ్యం కాని హామీలను బీజేపీ కూడా అనుమానిస్తున్నదనడానికి తాజా ఉదాహరణ మేనిఫెస్టోలో కనిపించిందన్నారు.. ఏమైందో తెలుసా ? పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా.. నీ ఫోటో మాత్రమే పెట్టుకో.. మోదీ ఫోటో మాత్రం పెట్టొద్దు.. మేం ఒప్పుకోం అన్నారు. కూటమిలో ముగ్గురు ఉండి ఆ ముగ్గురి ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితి లేదంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడానికి ఏ స్థాయిలో బరితెగించాడో అర్థమవుతున్నది అని జగన్ దుయ్యబట్టారు.
బాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు మంగళమే..
వైసీపీకి ఓట్లు- వేస్తే పథకాలు యథాతథంగా కొనసాగుతాయని, అదే చంద్రబాబుకు ఓటు- వేస్తే పథకాలు మాయమవుతాయని ప్రజలను హెచ్చరించారు. అధికారం పేరుతో గతంలో ప్రజా సొమ్మును దోచుకొని, దాచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రంలో మీ బిడ్డ జగన్ అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటరీ వ్యవస్థ తీసుకు వచ్చి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకువచ్చినది తన ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నది పేదవాడి తలరాతను భవిష్యత్తును మార్చేవన్నారు. ప్రజలకు మాట ఇస్తే పనిచేసే నాయకుడికి ఓటు- వేయాలని పిలుపునిచ్చారు. నాయకులు అంటే ప్రజల్లో నమ్మకం ఉండాలన్నారు. ఎన్నికల్లో తాను ఒక్కడే ఒకవైపు, తోడేళ్ల గుంపు మరోవైపు ఎన్నికల్లో బరిలో నిలిచాయని ధ్వజమెత్తారు. ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేయలేదని ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలను మాయ చేసేలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ, డాక్రా మహిళలకు రుణమాఫీ, బ్యాంకుల్లో బంగారం మాఫీ ఇలా మరెన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పథకాలు యథా తథంగా కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలని, అది మీ చేతుల్లోనే ఉందని ఓటర్లకు తేల్చి చెప్పారు.
ఉచిత విద్యుత్ అంటే ఎలా ఇస్తారు, ఇక విద్యుత్ తీగల మీద దుస్తులు ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇదే చంద్రబాబు విమర్శించారని, కానీ వైయస్సార్ హయాంలో రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి రైతులకు రూపాయి కరెంట్ బిల్లు కట్టకుండా చేశారని చెప్పారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా మీ బిడ్డ జగనన్న అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్తు నిరంతరంగా 9 గంటలు ఇచ్చింది మీ జగన్ కాదా అని ప్రజలను అడిగారు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు నిర్మించి సకాలంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, భరోసా పేరుతో పెట్టుబడి నగదు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించింది వైసీపీ ప్రభుత్వం కాదా అన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేక రైతులకు సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందక ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు.
నన్ను గెలిపిస్తే కొనసాగింపు..బాబుకు ఓటేస్తే ముగింపు..
సంక్షేమ పథకాలపై తేల్చి చెప్పిన వైసీపీ అధినేత, సీఎం జగన్
చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన నేరప్రవృత్తికి నిదర్శనమని వ్యాఖ్య
వెన్నుపోట్లు పొడవడం, మనుషుల్ని చంపేయడమే బాబు రాజకీయం
బొబ్బిలి ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో గర్జించిన జగన్
(విజయనగరం-ప్రభ న్యూస్ బ్యూరో) : వైసీపీని ఆదరించి గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే ఆ పథకాల ముగింపు తధ్యమని జోస్యం చెప్పారు. బొబ్బిలిలో బుధవారం జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తన తండ్రి వైఎస్ గాల్లోనే కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా నాడు చంద్రబాబు అన్న మాటలను తాను ఎప్పటికీ మరువలేనన్నారు. నాడు తన తండ్రిని..నేడు తనని.. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే చంద్రబాబునాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అతడి నేర ప్రవృత్తికి నిదర్శనమని పేర్కొన్నారు. జగన్‌ను చంపేస్తే తప్పేంటి అంటున్న చంద్రబాబు ఆయన అనుకుంటే జగన్ చనిపోడన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారన్నారు. తన స్థాయిని మరచి దిగజారుడు మాటలాడుతున్న చంద్రబాబు మానసిక పరిస్థితిపై అందరూ ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత వుందన్నారు. వెన్నుపోట్లు పొడవడం, మనుషుల్ని చంపేయడమే చంద్రబాబు రాజకీయమని అందరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్‌ను, వంగవీటి మోహనరంగాను కుట్రలతో చంపిందెవరో ? ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతో చంపిందెవరో ? ఎవ్వరికీ తెలియదనుకుంటే పొరపాటవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో రైతన్నలకు మేలు చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబునాయుడు అసత్య, విషప్రచారం మొదలెట్టారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ భూములు దోచుకుంటాడని, ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడన్న వాస్తవాన్ని అంతా గ్రహించాలన్నారు. జగన్ భూములిచ్చేవాడే తప్ప చంద్రబాబునాయుడులా భూములు దోచుకునే వాడు కాదని అందరూ అర్ధం చేసుకోవాలన్నారు. వందేళ్ల కిందట జరిగిన సర్వేలో భూముల సబ్ డివిజన్, రికార్థుల ఫైలింగ్ సరిగ్గా జరగక పోవడంతో భూవివాదాలు తలెత్తి రైతులు, ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తుచేశారు. దీన్ని పరిష్కరించి భూములపై సర్వహక్కులు అర్హులకు అందించే ల్యాండ్-టైటిలింగ్ యాక్ట్‌కు మద్దతు తెలపాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.
మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకుని ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారని జగన్మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2014లో ఇదే పార్టీల పొత్తులతో ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం 10 శాతమైనా అమలు చేసారా ? అని ప్రశ్నించారు. మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబూ ? అని నిలదీశారు. అప్పట్లో ఓట్ల కోసం ఆయనే స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించారని, అందులో రైతన్నకు రుణమాఫీ అని గెలవగానే మోసం చేసి చివరకు నట్టేట ముంచారని గుర్తుచేశారు. డ్వాక్రా పొదుపు సంఘాల రుణాల మాఫీ అని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేసిన మాట నిజమా ? కాదా ? చంద్రబాబూ అని నిలదీశారు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చే చంద్రబాబు లాంటి వ్యక్తులను ప్రజలు ఎవరైనా నమ్మగలరా ? అంటూ బహిరంగ సభ వేదికగా జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. వృద్ధులకు ఇంటి వద్దకే వస్తున్న పెన్షన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకుని అవ్వాతాతల ఉసురు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థను తానే అడ్డుకుని ఎన్నికల ప్రచారంలో మాత్రం పెన్షన్లను అడ్డుకుంది జగన్ అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అని ప్రశ్నించారు.
తమ విషయానికి వస్తే మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99శాతం అమలు చేశామని, దానిని దృష్టిలో పెట్టుకొని మే 13న జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామంలో తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్‌ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.