Tuesday, November 26, 2024

AP: కియా కారు కనిపిస్తే.. అనంత గుర్తుకొస్తుంది… శంఖారావం సభలో నారా లోకేష్

అనంతపురం, మార్చి 11, ప్రభ న్యూస్ బ్యూరో : దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా అనంతపురం జిల్లా గుర్తుకు వస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సోమవారం అనంతపురంలో జరిగిన శంఖారావసభలో ప్రసంగించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. కరువుకు అలవాలమైన అనంతలో పారిశ్రామిక అభివృద్ధి బాబు వల్ల సాధ్యమైందన్నారు. ఈ నేల చాలా పవర్ పుల్, ఇక్కడి ప్రజలకు మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు. అన్యాయం చేస్తే తోలుతీసే శక్తి అనంత ప్రజలకు ఉందని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు మహా మొండివారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోరని తెలిపారు.

అన్న ఎన్టీఆర్ ని గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన జిల్లా అనంతపురం అన్నారు. ఇలాంటి పవిత్ర నేలపై రెండో సారి మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ను భర్త రఫ్ చేస్తే ఈ జిల్లా ప్రజలు తిరుగుబాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మనకో బిల్డప్ బాబాయి జగన్ ఉన్నాడు. ఎవరైనా పులిని చూసి భయపడతారు. సిద్ధం సభలో డ్రోన్ ను చూసి భయపడ్డాడన్నారు. సభకు జనం రారని తెలిసి గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేసినట్లు విమర్శించారు. అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్లకు చెబుతున్నా.. ఎందుకు డ్రోన్ చూసి పిల్లుల్లా భయపడుతున్నారని ప్రశ్నించారు. ఖాళీ కుర్చీలను డ్రోన్ తో వీడియో తీస్తున్నారని వారే చెప్పారు. బాహుబలిని చూపిస్తానని చెప్పి పులకేశి సినిమా చూపించారని చమత్కరించారు.

జగన్ ముఖంలో భయం, టెన్షన్ కనిపించింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తును చూసి జగన్ భయపడుతున్నట్లు తెలిపారు.
జగన్ పని అయిపోయిందన్నారు. చరిత్ర ఉన్నంతవరకు జగన్ ఉంటాడంటా.. క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు సైకో పేరు ఉండటం ఖాయం. చంచల్ గూడ జైలులో జగన్ పేరు ఉండటం ఖాయమన్నారు. వైట్ కాలర్ నేరస్థుడు జగన్ అన్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా జగన్ కేసులపై కేసు స్టడీ ఉంది. ఇలాంటి వారిని ఎలా ఎన్నుకుంటున్నారో అనే చర్చలు నడుస్తున్నాయన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటానంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏడాదికి 6500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ఏమైంది ?, 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీ ఏమైంది ? ముఖ్యమంత్రి అయిన ఆరునెలలకు హామీలు అమలుచేస్తే చిత్తశుద్ధి అన్నారు, చివరి ఆరు నెలల్లో చేస్తే మోసం అన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు గ్రూప్-2 నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిని ఏమంటారు? అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement