మచిలీపట్నం, మే 30( ప్రభ న్యూస్) : కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా ఎన్నికల అధికారి బాలాజీ ఇతర అధికారులకు కొన్ని సూచనలు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా అలజడులు సృష్టిస్తే ఎన్నికల సంఘం ఎవరినీ ఉపేక్షించేది లేదని, అట్టి వారినీ అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ పార్టీ ఫిర్యాదును కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలిపామని, దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల ప్రధాన అధికారి…
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. వారు తొలుత జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి అద్నాన్ నయీమ్ అస్మి, సంయుక్త కలెక్టర్ గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మలతో కలిసి విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అకాడమిక్ భవనంలోని మచిలీపట్నం, గుడివాడ, పెడన, పామర్రు, అవనిగడ్డ, గన్నవరం, పెనమలూరు శాసనసభ నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాళ్ళు, స్ట్రాంగ్ రూములు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు గదులు, అక్కడ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన టేబుళ్ళు, కుర్చీలు, ఆర్వోలు, పరిశీలకుల టేబుళ్ళు, కౌంటింగ్ ఏజెంట్ల పరిశీలన కోసం ఇనుప కడ్డీలతో మెష్ ఏర్పాట్లు కుర్చీలు, ఈటీపీబిఎస్, ఎన్కోర్ కౌంటర్లు, కంపైలేషన్ విభాగాలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
స్ట్రాంగ్ రూముల లాగ్ బుక్కులను తనిఖీ చేసి సీఈవో సంతకం చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో జిల్లా ఎన్నికల అధికారి సీఈఓకు వివరించారు. కేంద్రంలో నిరంతర విద్యుత్ అంతర్జాలం సరఫరా సజావుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఈవో సూచించారు. అనంతరం సీఈవో అకాడమిక్ భవనం ఎదురుగా నూతన భవనాల్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను పక్కనే స్ట్రాంగ్ రూముల పరిశీలన కోసం సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు పరిశీలించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో సీఈఓ వెంట డీఆర్ఓ చంద్రశేఖర రావు, మచిలీపట్నం, గుడివాడ, పెడన, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు రిటర్నింగ్ అధికారులు ఎం.వాణి, పి.పద్మావతి, పి.వెంకటరమణ, శ్రీదేవి, జి.బాలసుబ్రమణ్యం, డి.రాజు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి షాహిద్ బాబు, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడి మనిషా త్రిపాఠి, తదితర అధికారులు పాల్గొన్నారు.