Wednesday, November 20, 2024

AP | అర్ధవంతమైన చర్చకు వస్తే అందరికీ అవకాశం : స్పీకర్ అయ్యన్న

కాణిపాకం, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : సభా సంప్రదాయాలను, గౌరవాన్ని కాపాడుతూ అర్ధవంతమైన చర్చల్లో పాల్గొనేవారు ఏ పార్టీ వారికైనా అవకాశం ఇస్తామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేసారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సాయంత్రం కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటైన విలేకరుల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ…..

రాష్ట్రం అన్నిరంగాలలో ఉన్నత స్థితిలో ఉండేలా దీవించాలని భగవంతుని ప్రార్ధించానని తెలిపారు. ఎందరో ప్రాణత్యాగాల ఫలంగా 78 ఏళ్ల క్రితం దేశానికి లభించిన స్వతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ అభివృద్ధి పధంలో సాగడమే నిజమైన నివాళి అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా తాను అర్ధవంతమైన చర్చ జరగాలని కోరుకుంటానని అన్నారు. అందుకోసం అన్ని పార్టీలకు సభ్యులు సభలో చర్చల్లో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాడలన్నారు.

ఆ విషయంలో తాను మాట్లాడే అవకాశం ఇవ్వనని బయట వినవచ్చే ప్రచారాలను ఖండిస్తూ అందరికీ సమాన అవకాశాలు ఇస్తానని అన్నారు. కాకుంటే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని తాను అనుమతించలేనని స్పష్టం చేసారు. సభా సంప్రదాయాలకు, గౌరవానికి భంగం కలిగించకుండా అర్ధ వంతమైన చర్చలకు అవకాశం ఇస్తానన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపెందుకు అందరూ కలిసి కృషి చేయాలన్నారు.

రాష్ట్ర అభివృద్ధి లో భాగంగా టెంపుల్ టూరిజం పాత్ర ఎంతో ఉంటుందని, ఆ దిశలో కూడా ఎక్కువ కృషి జరగాలని అన్నారు. తిరుమల దేవాలయం వల్లనే తిరుపతి ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాణిపాకం దేవాలయం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్నట్టు చెప్పారు. ఆలయానికి చేరుకున్న అయ్యన్న పాత్రుడు కు పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ మురళీ మోహన్ తదితర అధికార అనధికార ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement