అమరావతి, ఆంధ్రప్రభ: ఉపా చట్టం కింద ప్రత్యేక కోర్టు బెయిల్ తిరస్కరిస్తే దానిపై ధర్మాసనం ముందు అప్పీల్‌కు వెళ్లాలి.. ధర్మాసనమే విచారణ జరపాలి.. క్రిమినల్ పిటిషన్‌కు తావులేదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు (ఉపా) చట్టం కింద అరెస్టయిన మావోయిస్టు సానుభూతిపరుడు నాగన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం క్రిమినల్ పిటిషన్‌కు విచారణార్హతలేదని త్రోసిపుచ్చింది. ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. మావోయిస్టులకు సహకారాన్ని అందిస్తున్నాడనే ఆరోపణతో విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు వంగి నాగన్నను 2020లో అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపట్టింది.
నాగన్నపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయటంతో పాటు కస్టడీలో వెల్లడించిన వివరాల ఆధారంగా మరికొందర్ని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. కాగా అరెస్టయిన నాగన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. ఎన్‌ఐఏ తరుపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్ హరినాథ్ వాదనలు వినిపించారు.
పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరాలు లేవనెత్తారు. ఉపా చట్టం కింద ఎన్‌ఐఏ కేసు నమోదు చేసిందని 21(4) సెక్షన్ ప్రకారం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తే దానిపై ధర్మాసనం ముందు అప్పీల్ చేయాల్సిందే తప్ప మరో మార్గం లేదన్నారు. నాగన్న బెయిల్ పిటిషన్‌కు విచారణ అర్హతలేదన్నారు. ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకోవాలనే వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. నాగన్న దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌కు విచారణార్హతలేదంటూ కొట్టేశారు. ఎన్‌ఐఏ సెక్షన్ 21(4) సెక్షన్ ప్రకారం ధర్మాసనం ముందు మాత్రమే అప్పీల్ చేసుకోవాల్సి ఉందని తీర్పునిచ్చారు.