రాయలసీమ డిమాండ్లు నెరవేర్చకుంటే పోరాటం ఉధృతం చేస్తామని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఎస్టీబిసి కళాశాల మైదానంలో కర్తవ్య దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పలువురు హాజరయ్యారు. ఈ దీక్ష ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ అభివృద్ధిపై కేంద్రానికి, ప్రధాని మోడీకి ఎన్నో లేఖలు రాశామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కర్ణాటక తరహాలో రాయలసీమను అభివృద్ధి చేయాలని తెలిపినా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. బ్రిటిష్ వారు కట్టించిన హౌస్పేట్ డ్యామ్‌ను అప్పర్ భద్రతో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం బాధాకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాయలసీమకు తీవ్ర అన్యాయాన్ని చేస్తున్నాయని మండిపడ్డారు.
రాయలసీమకు ఏమి చేశారో వివరించాలన్నారు. చిల్లర వేసినట్టు పనికిరాని ప్రాజెక్టులు ఇచ్చి మరింత వెనకబాటుకు గురిచేశారన్నారు. రాయలసీమ డిమాండ్లు నెరవేర్చకుంటే తెలంగాణ విడిపోయాక అభివృద్ధి జరిగింది.. అదే కోణంలో ప్రత్యేక రాయలసీమ రాష్టం దిశగా పోరాటం ఉధృతం చేస్తామన్నారు. రాయలసీమ నుండి ముఖ్యమంత్రులుగా పాలించినా రాయలసీమ మాత్రం వెనక్కి నెట్టివేయబడిందన్నారు. కర్తవ్య దీక్ష అనంతరం సంతకాల సేకరణ, తరువాత చలో ఢిల్లీ కార్యక్రమాలు వరుసగా కొనసాగుతాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుంటే రాయలసీమ రాష్టం ఉద్యమం తప్పదని హెచ్చరిక చేస్తున్నామన్నారు. కర్తవ్య దీక్షకు మైసూరా రెడ్డి, శైలజానాథ్, జె.సి దివాకర్ రెడ్డి, డి.యల్.రవీంద్ర రెడ్డి, సిపిఎం నుండి ఎం.ఏ గపూర్, గంగుల ప్రతాప్ రెడ్డి, గద్దర్, మందకృష్ణ మాదిగ, తదితర ప్రముఖ నాయకులు హాజరు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా యువత రైతాంగం, ఉద్యమకారులు, పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ… రాయల తెలంగాణ ఏర్పడుతుందన్నారు. సీఎం కేసీఆర్ తో ఇప్పటికే చర్చించామని, కర్నూల్, అనంత పురం జిల్లాలు రాయల తెలంగాణలో ఉంటాయన్నారు.