(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా పెద్దల నాయకత్వంలో పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటి సారిగా విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం ఆయన విచ్చేశారు. ఈసందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నిత్యం రఘురాం, విజయవాడ పార్లమెంట్ సీనియర్ నాయకుడు కేశినేని చిన్నితో పాటు ఇతర నాయకులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ… ఇకపై టీడీపీ సభ్యునిగా కార్యక్రమాలు ప్రారంభిస్తానన్నారు. టీడీపీ సిద్దాంతాలకు అనుగుణంగా సేవలందిస్తానన్నారు. 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచే తన తండ్రి వసంత నాగేశ్వరరావు టీడీపీ నుంచి ప్రజాసేవ చేశారని గుర్తుచేశారు.
చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. యువత బంగారు భవిష్యత్తుకు రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. ఆదాయ వనరులు పెంచి జీవనోపాధి కల్పించాలన్నారు. సంపదను సృష్టించాలన్నారు. అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కూడా అవసరం అన్నారు. రెండింటిని ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే టీడీపీ-జనసేన కూటమి ప్రధాన ఎజెండా అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబునాయుడుపై ఆధారపడి ఉందన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధిస్తామనే నినాదంతో ఒక్క అవకాశం అంటూ అధికార పీఠమెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వైయస్సార్ ఆశయాలను విస్మరించారని పేర్కొన్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి గతంలో పాలన కొనసాగించారని గుర్తు చేశారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పూర్తిగా విడనాడినట్లు స్పష్టం చేశారు. దీంతో తమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. వేదిక ఏదైనప్పటికీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం శ్రమిస్తానన్నారు.
విమర్శకు, అసభ్య పదజాలంకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. విధాన పరంగా విమర్శలు చేస్తాను… తప్పితే వ్యక్తిగత దూషణలు చేయనన్నారు. కులాలు, మతాలు, గ్రూపులకు అతీతంగా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. అధినేత ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తానన్నారు. అక్రమ కేసులను కొన్ని శక్తులు గతంలో తనను ప్రేరేపించి పెట్టించాయన్నారు. వారందరినీ వ్యక్తిగతంగా కలుస్తానన్నారు. తనను కూడా అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తను ఏ తప్పు చేయలేదన్నారు. దేనికైనా తను సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేత కేశినేని శివనాథ్ (చిన్ని), టీడీపీ సీనియర్ నాయకులు గన్నే ప్రసాద్ (అన్నా), కోమటి సుధాకరరావు, జంపాల సీతారామయ్య, విజయబాబు, తదితరులు పాల్గొన్నారు.