Wednesday, November 20, 2024

వాళ్లొస్తే.. సంక్షేమ ప‌థ‌కాలు ఎత్తివేతే.. జ‌గ‌న్

చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు అధికారంలోకి వ‌స్తే తాను అమ‌లు చేస్తున్న అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎత్తివేస్తార‌ని, వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటు వేయొద్ద‌ని వైసీపీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలిలో చుక్క‌ల భూముల హ‌క్కుప‌త్రాల‌ను ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేసిన అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ ఇప్పుడు సడెన్‌గా రైతు బాంధవులయ్యారని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సూటుబూటు వేసుకుని రైతు సంక్షేమపథకాలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులను కోలుకోని దెబ్బ కొట్టారని.. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఇప్పుడు ఆయనతోపాటు పవన్ పొలిటికల్ బాంధవుల అవతారం ఎత్తారని విమర్శించారు. తనకు ఓటు వెయ్యకపోయినా ఫర్వాలేదు.. సంక్షేమమే ముఖ్యమనే లక్ష్యంతో పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు . పంటనష్టాల పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు, పవన్‌ను ఎద్దేవ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్‌ 22(1)ఏ నుంచి డీనోటిఫై చేశామన్నారు. దీంతో భూములపై రైతులకు సర్వహక్కులు లభించాయన్నారు.

2,06,171 ఎకరాల భూములకు సంపూర్ణ హక్కులు లభించాయని.. రూ.20 వేల కోట్ల మార్కెట్‌ విలువైన భూములకు సంపూర్ణ హక్కు లభించిందన్నారు. దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు విముక్తి పలికినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను కోలుకోని దెబ్బ కొట్టింద‌న్నారు. చంద్రబాబు హయాంలో భూములు అమ్ముకునే పరిస్థితి లేదని.. చుక్కల భూముల హక్కుతో బ్యాంకు రుణాలు తీసుకోవచ్చన్నారు. వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపామ‌న్నారు. రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించామ‌న్నారు. రైతన్నల కష్టం తాను చూశానని.. మీకు నేను ఉన్నానన్నారు. ఇప్పటికే గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేశాం. గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించామ‌న్నారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోందన్నారు. ఇప్పటికే 2వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశాం. భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నామ‌న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూసర్వే చేస్తున్నామ‌ని, ఈనెల 20న 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement