పవన్ కల్యాణ్ తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రోడ్డు పక్కన కుక్కను కాల్చినట్లుగా కాల్చేస్తారని.. తీవ్రవాది అయితే ఏం చేస్తాడు ? వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ ప్రజలను చంపేస్తాడా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గళాన్ని వినిపించటానికి రోడ్డెక్కే ప్రజలను పవన్ కల్యాణ్ తీవ్రవాది అయి ఏం చేస్తాడు ? అని కొడాలి నాని నిలదీశారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండటానికే మూడు ప్రాంతాల అభివృద్ధి విధానం తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు వత్తాసు పలికిన పార్టీల చంక ఎందుకు ఎక్కాడు ? అని ప్రశ్నించారు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం లక్షల కోట్లు తెచ్చి అమరావతిలోనే పెడతాం అంటున్నారు.. రేపు ఈ ప్రాంతంలో ఉన్న నా లాంటి వాళ్ళు పొమ్మంటే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు.
మాకు 55 శాతం ఓటు బ్యాంకు ఉంది.. అందరూ కట్ట కట్టుకొని వచ్చినా వెంట్రుక కూడా పీకలేరని.. బతికి ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్రెడ్డియే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు.. అభివృద్ధి అంటే స్విమ్మింగ్ పూల్ లో ఫారిన్ అమ్మాయిలను పెట్టుకుని మందు తాగటమా ? అంటూ సెటైర్లు వేశారు. గుడివాడలో క్యాసినో ఉందని రాష్ట్రపతి నుంచి ఈడీ వరకు అందరికీ లేఖలు రాశారు ? ఏమయ్యింది ? ఎవరైనా నా చిటికెన వేలు వెంట్రుక అయినా పీక గలిగారా ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక 420, లోకేష్ 120.. పాదయాత్రలే కాదు.. పొర్లు యాత్రలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.