Tuesday, November 26, 2024

అవినాష్ హత్య చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం.. ఎమ్మెల్యే రాచమల్లు

కడప, బ్యూరో, ప్రభన్యూస్ : కడప ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేసినట్లు నిర్ధారణ అయితే త‌మ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే మాట చెప్పానని ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. అవినాష్ హత్య చేసినట్లు నిరూపణ అయితే త‌నతోపాటు సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని గతంలో కూడా చెప్పానన్నారు. బుధవారం కడప రోడ్లు భవనాల శాఖ అతిధిగృహంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినాష్ ను ముద్దాయిగా చేసినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని, కోర్టులో విచారణ జరుగుతుంది, కోర్టు నేరస్తుడుగా చెప్తేనే దోషి అయినట్టు అన్నారు. అదే జరిగితే తాము పదవుల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. అవినాష్ రెడ్డి సౌమ్యుడని, హత్యలు చేసే మనస్తత్వం ఆయనది కాదన్నారు.


సునీతను ముందు పెట్టుకొని…
వైయస్ సునీతను ముందు పెట్టి రఘురామ కృష్ణంరాజు, సుజనా చౌదరిలు చేస్తున్న కుట్రలో భాగమే ఇది అని పేర్కొన్నారు. వైయస్ సునీతపై ప్రొద్దుటూరులో వెలసిన వాల్ పోస్టర్లు ఎవరో ఆకతాయిలు వేసి ఉండొచ్చు, లేకపోతే రాజకీయంగా వేసి ఉండొచ్చు, వాటిపై విచారణ జరగాలన్నారు. బెంగళూరులో ఈ పోస్టల్ ప్రింట్ అయినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు.. వచ్చినా ఇబ్బంది లేదు అంటూ మాట్లాడారు. అవినాష్ అరెస్టు చూపి చంద్రబాబు సంకలు గుద్దుకుంటున్నారని, అరెస్ట్ అయినా మూడు నెలలకే‌ బెయిల్ వస్తుందని పేర్కొన్నారు. ఈ హత్య పేరు చెప్పి లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని పేర్కొన్నారు. చేసింది.. చేసేది చెప్పుకోకుండా పదేపదే వివేక హత్య కేసును ప్రతిపక్షాలు ప్రస్తావించి లబ్ది పొందాలనుకుంటున్నాయని విమర్శించారు. వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం జగన్ కు ఏముందని ప్రశ్నించారు. జగన్ ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తారన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మహా కుట్రలో ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో వివేక హత్య కేసును ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. సంక్షేమం గురించి మాట్లాడకుండా ఎంతసేపు బాబాయి హత్య, గొడ్డలి అంటూ మాట్లాడుతూ ఉన్నారన్నారు. ఎదుటివారిని దుర్మార్గులను చేసి ఓట్లు అడిగే పార్టీ పార్టీయేనా, అలాంటి నాయకుడు నాయకుడా అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement