న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని గ్రాంట్‌గా ఇవ్వాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్‌సభలో జాతీయ రహదారులు రవాణ శాఖ పద్దులపై వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పొడవైన కోస్తా తీరం ఉందని, తరుచుగా వచ్చే ప్రకృతి వైపరీత్యాల వల్ల రోడ్లు దెబ్బ తింటున్నాయని అన్నారు. రాజమండ్రి నుంచి జాతీయ రహదారులు వెళుతున్నాయని చెప్పుకొచ్చారు. ఫ్లై ఓవర్ల పని పూర్తి కావడం లేదని, మోరంపుడి జంక్షన్‌ను డెత్ జంక్షన్‌గా పిలుస్తున్నారని భరత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజానగరం జంక్షన్, దివాన్‌చెరువు, లాలాచెరువు, బొమ్మురు, వేమగిరి, కడియపులంక, పొట్టిలంక, మోరంపుడి జంక్షన్ల వద్ద ఎక్కువ యాక్సిండెట్లు జరగుతున్నందున ఆయా జంక్షన్ల వద్ద ఫైఓవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
బ్లాక్ స్పాట్‌ల వద్ద ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయాలని, రోడ్డు భద్రతా చర్యలపై కేంద్రం సీరియస్‌గా వ్యవహరించాలని ఆయన వినతి చేశారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి బీమా ప్రీమియాన్ని పెంచాలని కోరారు. 2018లో రోడ్లు మంజూరైనా పనులు ఇంకా ప్రారంభించలేదని, రోడ్ల డివైడర్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఆయన అన్నారు. 516 ఈ గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పూర్తి చేయాలని, షెడ్యూల్ 13 ప్రకారం అమరావతి నుంచి హైదరాబాద్ వరకు ర్యాపిడ్ రోడ్డు కనెక్టివిటీ నిర్మాణం చేపట్టాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. 33 ఆర్‌వోబి, ఆర్‌యుబీలను పూర్తి చేయాలని అన్నారు. నెల్లూరు- కృష్ణపట్నం పోర్టు రోడ్డు అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయని మార్గాని భరత్ ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు – విశాఖపట్నం ఆరులైన్ల రోడ్డు పనులు చేపట్టాలని, ఏపీలోని 450 బ్లాక్ స్పాట్లలోప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.