Tuesday, November 26, 2024

ఇప్ప‌టిక‌ప్పుడు ఎల‌క్ష‌న్స్ వ‌స్తే.. టీడీపీకి 115, వైసీపీకి అభ్య‌ర్థులే దొర‌క‌రు.. సొంత‌పార్టీపై ర‌ఘురామ చుర‌క‌లు

సొంత పార్టీ, ప్రభుత్వంపై ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలిచే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాలో మాట్లాడుతూ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష టీడీపీకి 115 స్థానాలు, పాలకపక్ష వైసీపీకి 60 సీట్లు మాత్రమే వస్తాయ‌ని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారికంగా చేయించుకున్న సర్వేలోనే ఈ విష‌యం వెల్లడైంద‌ని బాంబు పేల్చారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, డిసెంబరులో శాసనసభను రద్దు చేస్తే.. మార్చి- ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగొచ్చని రఘురామ వ్యాఖ్యానించారు.

రానున్న ఎన్నికల్లో 100 మంది అభ్యర్థులను మార్చుతానని తమ పార్టీ అధినేత, సీఎం జగన్‌ అంటున్నారని, కానీ దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు టికెట్‌ అడిగే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ఖర్చులు ఇస్తానంటే తప్ప అభ్యర్థులు దొరకరని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మరోవైపు.. ఏపీలో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఇప్పటికే తన వ్యుహాలను అమలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న టీడీపీ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దమనే సంకేతాలు పంపుతుంది.

కాగా, ఇప్పటికే చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లా పర్యటన, మహానాడు‌ సక్సెస్.. టీడీపీలో జోష్ నింపాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే చంద్రబాబు క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టత, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పనితీరుపై దృష్టి సారించారు. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో గ్రూప్ రాజకీయాలను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలని.. టీడీపీలో పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలన్నారు. తన చుట్టూ ఎవ్వరు తిరిగితే లాభం ఉండదని, క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement