గత ఏడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై చిరుతు దాడి చేసి చంపింది. అయితే చిన్నారి పై దాడి చేసిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. నాల్గో చిరుతే.. చిన్నారి లక్షిత పై దాడి చేసినట్లు గుర్తించగా, చిరుతను జూపార్కులోనే సంరక్షించాలని నిర్ణయించింది టీటీడీ.
కాగా, గత ఏడాది ఆగస్టు 11వ తేదీన చిన్నారి లక్షిత(6)పై చిరుత దాడి చేసిన విషయం విదితమే కాగా.. ఆగస్టు 28వ తేదీన నాల్గో చిరుతను బంధించారు అటవీశాఖ అధికారులు.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేష్-శశికళ దంపతులు తమ కూతురు లక్షితతో కలిసి 11వ తేదీన రాత్రి 7.30 ప్రాంతంలో అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే, లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం వద్దకు చేరుకొనే సరికి అకస్మాత్తుగా ఓ చిరుత చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లింది. ఊహించని ఘటనలో షాక్ తిన్న తల్లిదండ్రులు.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదుచేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు సాధ్యం కాలేదు. అయితే, 12వ తేదీన ఉదయం లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయానికి సమీపంలో పోలీసులకు బాలిక మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలోనే చిన్నారి మృతిచెందినట్టు అప్పుడే గుర్తించగా.. ఇప్పుడు ఆ చిన్నారిపై దాడి చేసిన చిరుతను కూడా గుర్తించారు.