ఆడపిల్ల పుట్టిందన్న బాధతో ఓ గిరిజన కుటుంబం చిన్నారిని రెండు లక్షలకు అమ్మేసింది. ఈ ఘటన విశాఖ మన్యంలో జరిగింది. దీనిపై ఇవ్వాల (సోమవారం) MVP పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ బుక్ అయ్యింది. అయితే.. అనధికార పిల్లల దత్తత నిషేధమని, ఇట్లాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) సభ్యులు, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్‌సిపిసిఆర్) సభ్యుడు గోండు సీతారాం ఈ ఘటన గురించి ఎంవీపీ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రసాద్‌కు సమాచారం అందించారు.
సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 15వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గిరిజన దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డను వేరే వారికి ₹ 2 లక్షలకు ఇచ్చారని ఆరోపించారు. ఈ అనధికార దత్తత విషయంలో ఆశ వర్కర్ ప్రమేయం కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎంవీపీ పోలీసులు తెలిపారు. ప్రజలు తమ ప్రాంతంలో ఇలాంటి అనధికార దత్తతలను గుర్తిస్తే పోలీసులను సంప్రదించవచ్చని చెప్పారు.