Wednesday, November 20, 2024

AP | ఏపీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఐబీ సిలబస్..

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఇవ్వాల చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు క్రమంగా ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఐబీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయనుంది.

ఏపీ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై తాము నిబద్ధతతో పనిచేస్తామని, విద్యద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం అన్నది కూడా ఇదే ప్రథమం అన్నారు.

- Advertisement -

రాబోయే తరాలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తి కావాలన్నారు. తొలుత ప్లే బేస్డు లెర్నింగ్‌ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టిసారిస్తామని ఆయన తెలిపారు. దీనివల్ల కొత్త సామర్థ్యాలు వీరికి అలవడతాయన్నారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ . ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం తమకు గొప్ప సంతృప్తి ఇస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం సంతృప్తినిచ్చే కార్యక్రమమన్నారు. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్‌ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా భారత్‌ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement