Friday, November 22, 2024

Breaking: డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్ కావాల‌న్న ఐఏఎస్‌.. ఆరా తీస్తే బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు బాగోతం..

ఓ వ్య‌క్తి ఐఏఎస్​ అవతారమెత్తి నమ్మిన వారిని ఫుల్‌గా ముంచేశాడు. కలెక్టర్​గా చలామణి అవుతూ ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్ప‌డ్డాడు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. తీగ లాగితే ఆ ఆఫీసరు అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. గుంటూరు జిల్లాలో ఈ న‌కిలీ ఐఏఎస్ విష‌యం వెలుగు చూసింది. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు కొంతకాలం హైదరాబాద్ లో జాబ్ చేశాడు. ఆ తర్వాత గుంటూరుకు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో ఓ కన్నింగ్‌ ప్లాన్ వేశాడు.‌ నగరంలోని బాలాజీ హాస్పిటల్ ఎండీ చంద్రశేఖర్ కి ఫోన్ చేశాడు. తనని తాను ఐఏఎస్ కృష్ణ బాబుగా పరిచయం చేసుకున్నాడు. తాను చెప్పిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని బెదిరించాడు. ఉద్యోగంతో పాటు జీతం కూడా ఎంతో తానే చెప్పాడు. నెలకి 40 వేల రూపాయలు ఇవ్వాలన్నాడు. అంతేకాదు. ప్రత్యేక కేబిన్ ఏర్పాటు చేసి మేనేజర్ హోదా ఇవ్వాలన్నాడు. తాను చెప్పినట్లు చేయకపోతే హాస్పిట‌ల్‌నే సీజ్ చేస్తానని హెచ్చరించాడు.

దీనికి సరే అన్న ఆ డాక్టర్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియ‌జేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్ప‌త్రి మేనేజర్ చేత శ్రీనివాసరావుకి ఫోన్ చేయించారు. మీరు చెప్పినట్లు ఉద్యోగం ఏర్పాటు చేశామని.. ఆ ఉద్యోగిని పంపాలని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత హాస్పిట‌ల్‌కి వచ్చిన వ్యక్తి ని పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఉద్యోగం కావాలని వచ్చిన వ్యక్తే శ్రీనివాస్ అని.. ఉద్యోగం కావాలని ఐఏఎస్ అధికారి పేరుతో ఫోన్ చేసింది కూడా తానేనని ఒప్పుకున్నాడు. అయితే, కేవలం బాలాజీ ఆసుపత్రి కే కాకుండా… ఇంకా రెండు మూడు ఆసుపత్రులకు ఇదేవిధంగా ఫోన్ చేసి ఉద్యోగం కావాలని బెదిరించినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఫేక్‌ కలెక్టర్‌ శ్రీనివాసరావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement