విశాఖపట్నం : డిసెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాబుతూ…. నగరానికి ఉజ్జ్వల భవిష్యత్ ఉందని సీఎం జగన్ అన్నారు. వైజాగ్ కలల నగరంగా అభివృద్ధి చెందబోతోందన్నారు. ఇన్ఫోసిస్ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందన్నారు. ఇన్ఫోసిస్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. డిసెంబర్ నాటికి తాను కూడా విశాఖకు రాబోతున్నానన్నారు. అప్పట్నుంచి అక్కడే ఉంటానన్నారు. పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే వస్తుందన్నారు. ఇక్కడి నుంచే పాలన సాగుతుందన్నారు.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తరహాలో విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందన్నారు. 8 వర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయన్నారు. ఏటా 15 వేల ఇంజినీర్లను వైజాగ్ అందిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతమన్నారు. ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకంగా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. కంపెనీలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.