ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ : పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడూ చేయనని, పార్టీకి తానెప్పుడూ విధేయుడిగానే పని చేస్తానని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు చెప్పారు. మాజీ మంత్రి జోగి రమేష్‌తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని, విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఘటన యాధృచ్చికంగా జరిగిందని చెప్పారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని, జోగి రమేష్ వస్తున్నారన్న సమాచారం తనకు ఏమాత్రం తెలియదన్నారు. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చారని కొనకళ్ల నారాయణరావు వివరించారు.
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ వివాదం చేయకూడదని…
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదన్న ఉద్దేశంతోనే జోగి రమేష్ వచ్చినా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని నారాయణరావు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తానని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిని కాపాడాల్సిన అవసరం కూటమి నేతలకు లేదన్నారు. పేర్ని నాని చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు.