Saturday, November 23, 2024

చిరువ్యాపారులకు తోడుగా నేనుంటా.. సీఎం జగన్

చిరు వ్యాపారుల కష్టాల్లోంచి పుట్టుకొచ్చిందే జగనన్న తోడని, చిరువ్యాపారులకు తోడుగా నేనుంటానని సీఎం జగన్ అన్నారు.వ‌రుస‌గా నాల్గ‌వ ఏడాది జ‌గ‌న‌న్న తోడు పథాకాన్ని అమలు చేయటం ఆనందంగా ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్ వర్చువల్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న తోడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప‌థ‌కం కింద 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ. 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నామని సీఎం జగన్ తెలిపారు.

చిరు వ్యాపారులకు పెట్టుబడి సాయంగా వడ్డీలేని రుణాలు…రాష్ట్రంలో ఉన్న చిరు వ్యాపారులకు పెట్టుబడి కష్టాలకు చెక్ పెడుతూ వారికి సాయంగా వడ్డీలేని రుణాలు అందజేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వారికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకువచ్చామన్నారు. ఈ పథకం ద్వారా 5,10,412 మంది లబ్ధిదారులకు రూ.560.73​ కోట్ల లబ్ధి చేకూరుతుందని, ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందుతాయని తెలిపారు. అంతేకాకుండా కొత్తగా మరో 56 వేల మందికి జగనన్న తోడు అందిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కూడా విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ రూ. 2,955 కోట్ల వడ్డీ లేని రుణం అందించామని స్ఫష్టం చేశారు.

పేదలకు మంచి చేసే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది…
ఇప్పటివరకు 4.54 లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి మళ్లీ రూ.10 వేలు, ఆపై రుణాలుగా అందుకుంటున్నారని సీఎం జగన్ తెలిపారు. సకాలంలో చెల్లించిన వారికి రూ. 13 వేల వరకూ వడ్డీ లేని రుణమని, జగనన్న తోడు ద్వారా లబ్ధిపొందిన వారిలో 80 శాతం అక్కా చెల్లెమ్మలే ఉన్నారని పేర్కొన్నారు.

- Advertisement -

దేశమంతా ఒక వైపు ఏపీ మరోవైపు: సీఎం
దేశంలో ఎక్కడా జరగడం లేదు. దేశం మొత్తం ఒకవైపు ఉంటే.. ఏపీ మరోవైపున ఉందన్నారు. ఈ స్థాయిలో రుణాలు ఇప్పించడం దేశంలోనే ఒక అరుదైన ఘటన అన్నారు. ఈ కార్యక్రమాన్ని సత్ఫలితాలు ఇచ్చే విధంగా నడిపిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్‌ వ్యవస్థ, సెర్ఫ్, మెప్మా వ్యవస్థలు, మరీ ముఖ్యంగా తోడ్పాటు అందిస్తున్న బ్యాంకర్లకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అందరం ఒక్కటై కలిసికట్టుగా చెయ్యి అందిస్తేనే పేదవాడికి మంచి జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.

రూ.2,955 కోట్లు వడ్డీ లేని రుణం ఇవ్వగలిగాం: సీఎం జగన్
చిరువ్యాపారులకు వడ్డీలేని రుణం అక్షరాల రూ.2,955 కోట్లు ఇవ్వగలిగామని చెప్పడానికి సంతోషపడుతున్నానని సీఎం హర్షం వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల మంది రుణాలు అందుకోగా, ఇందులో మల్టీఫుల్‌ టైమ్స్‌లో రుణాలు చెల్లించిన వారు 13.29 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటికే చిరు వ్యాపారులకు వడ్డీ కింద రూ.74.69 కోట్లు తిరిగి చెల్లించామని, నిజానికి చిరువ్యాపారులంతా కూడా తమకు తాము ఒక వ్యాపకం కల్పించుకోవడమే కాకుండా సమాజ సేవ చేస్తున్నారన్నారు.

చిరువ్యాపారులకు తోడుగా నేనుంటా..
ఒకరిపై ఆధారపడే పరిస్థితి లేకుండా వాళ్లకు అవకాశం వస్తే మరో ఇద్దరు, ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నారని, చిరు వ్యాపారాలు చేసే వారందరికీ నా హృదయపూర్వకంగా తోడుగా నిలుస్తున్నానని ఉద్ఘాటించారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసే వారు, సైకిళ్లు, మోటర్‌ సైకిళ్లపై వ్యాపారం చేసుకునేవారు, చేతికళాకారులు, బొబ్బిలి వీణా, కొండపల్లి బొమ్మలు, లెస్‌ వర్కర్లకు ఈ పథకం వర్తిస్తోందని, అందరికీ కూడా సున్నా వడ్డీ వాళ్ల చేతుల్లో పెడుతున్నామని చెప్పారు. ఇది ఒక గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు.

నా పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలను చూసా..
ఈ పథకం ఎలా పుట్టుకొచ్చిందంటే.. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశాను. ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు చేసే వారితో కలిసి మాట్లాడాను. పెట్టుబడి రూ,1000 కావాల్సి వస్తే అందులో రూ.100 కట్‌ చేసుకొని మళ్లీ సాయంత్రం చెల్లించే పరిస్థితి ఉండేది. అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం నిజంగా ఇబ్బందికర పరిస్థితి. ఇలాంటి వారికి తోడుగా నిలిచేందుకు జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ మన ప్రభుత్వంలో లబ్ధి..
ఇంకా ఎవరికైనా ఈ పథకం వర్తించకపోతే గ్రామాల్లో ఉన్న సచివాలయ వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉందని, వాలంటీర్లను అడిగినా కూడా మీకు తోడుగా నిలుస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. 1902కు ఫోన్‌ చేసినా కూడా మీకు సమాచారం ఇస్తారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తపన, తాపత్రయంతో పని చేసే ప్రభుత్వం ఇదని సీఎం ఉద్ఘాటించారు. ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడి దయతో రావాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం జగన్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement