తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : “నా మీద క్రిస్టియన్ అని, నాస్తికుడననే కువిమర్శలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం.. అటువంటి ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదు” అని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీ టీ డి ) ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు (ఆదివారం) తిరుపతిలో జరిగిన “మూడు తరాల మనిషి భూమన్” అనే పుస్తకావిష్కరణ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆ వేదిక పై మాట్లాడుతూ ఇటీవలికాలంలో సామాజిక మధ్యమాలలో తనపై వస్తున్న మత పరమైన విమర్శలపై తొలిసారిగా స్పందించారు.
ఈ సందర్బంగా కరుణాకర రెడ్డి మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయినప్పుడు తిరుమలేశుని ఆశీస్సులతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని చెప్పారు. తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకున్నది తానేనని తెలిపారు. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ,
దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది కూడా తానేనని గుర్తు చేసారు. అన్నిటినిమించి ఎన్నో పోరాటాల ద్వారా పైకి వచ్చిన వ్యక్తి గా కేవలం రాజకీయ పరమైన కారణాలతో తన వ్యక్తిత్వం పైన, తన మతం పైన కొందరు పనికట్టుకుని చేసే కువిమర్శలకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.