తాను టీడీపీతో టచ్ లో లేనని.. రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగన్ తోనే ఉంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే.. అదికూడా ఒంగోలు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు బాలినేని.. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నా.. విలువల కోసమే మంత్రి పదవిని వదులకుని.. సీఎం వైఎస్ జగన్ వెంట నడిచానని తెలిపారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్ధానాల మార్పు జరుగుతోందన్నారు. ఇక, తాను గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు బాలినేని.. అంతేకాదు.. పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు..
తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లో ఉన్నానన్నది అవాస్తవమని తేల్చేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ పార్టీకి, సీఎం జగన్ కు అండగా ఉండాల్సిన సమయమన్నారు. ఎంపీ మాగుంట విషయాన్ని కూడా సీఎం జగన్ తో మాట్లాడుతానని తెలిపారు. ఇక సీట్లు, పోటీపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్ణయమే శిరోధార్యమని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.