Saturday, November 23, 2024

నేను లోకల్, ఎవ్వరినీ వదలను.. ఏ బావ కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు: ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నేను లోకల్- ఎవ్వరినీ వదిలిపెట్టనని సీనియర్ ఐపీఎస్, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేసిన భారత సర్వోన్నత న్యాయస్థానం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. తనపై సస్పెన్షన్ విధించి రెండేళ్లవుతున్నా ఇంకా ఎత్తివేయలేదని, తనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలంటూ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కేసు విచారణలో ఉండగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. శుక్రవారం పూర్తి స్థాయి విచారణ జరిపిన ధర్మాసనం ఐపీఎస్ అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించడానికి వీల్లేదని పేర్కొంది. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏబీవీపై సస్పెన్షన్ ఏకపక్షం, చట్టవిరుద్ధమంటూ సస్పెన్షన్‌ను కొట్టివేస్తూ గతంలో ఆంద్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.

అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 8 రెండో శనివారం అర్థరాత్రి తనను సస్పెండ్ చేశారని, తనపై ఎన్నో అభాండాలు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఒక పత్రికా ప్రకటన చేశానని, ఈ చర్యకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని చెప్పానని గుర్తు చేశారు. చట్ట ప్రకారమే నడుచుకున్నానని, ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించిందని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇదంతా ఎందుకు జరిగింది, దీనికి కారకులెవరు? సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమెవరని ఆయన ప్రశ్నించారు. ఏ బావ కళ్లలో, ఏ సైకో, ఏ శాడిస్ట్ కళ్ళలో ఆనందం కోసం ఇదంతా చేశారని తీవ్ర స్థాయిలో నిలదీశారు.

న్యాయస్థానాల్లో న్యాయవాదుల బృందాన్ని నియమించుకుని కోట్లు ఖర్చు చేశారని వివరించారు. న్యాయం కోసం పోరాడడానికి తనకు కూడా చాలా ఖర్చయిందని ఏబీవీ వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు సమానంగా డబ్బు చెల్లించాలని కోరతానని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ఖర్చుకు కారకులెవరని ఆయన ప్రశ్నించారు. దొంగ కేసులు, పనికిమాలిన కేసులు పెట్టి ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును ఖర్చు పెట్టారని ఆరోపించారు. చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్న వారిని శిక్షించాలని, వారి నుంచి డబ్బు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల ప్రవర్తనను సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి సమర్పించానని వెల్లడించారు.

తన సస్పెన్షన్ వ్యవహారంలో తలా, తోకా లేని ఆవు వ్యాసాన్ని ఏళ్ల తరబడి చెబుతూ వచ్చారని, అసలు నిఘా పరికరాల కొనుగోళ్లే జరగని వ్యవహారంలో అవినీతి జరిగిందని ఆరోపించారన్న ఆయన, ఏం జరిగిందో కనీసం ఆలోచించరా? వృత్తి నైపుణ్యం లేదా? అని ప్రశ్నించారు. చట్ట విరుద్ధమైన నిర్ణయాలతో అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి చెడ్డపేరు తీసుకొచ్చారని వెంకటేశ్వరరావు విమర్శించారు. అలాంటి వారికి బుద్ది చెప్పేలా శిక్షించాలని, ఈ వ్యవహారంలో జరిగిన నష్టం, అయిన ఖర్చు మొత్తాన్ని వారి జేబుల్లో నుంచి వసూలు చేయాలని కోరతానని తెలిపారు. ప్రతి రూపాయికీ లెక్క చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. అధికారులు వస్తారు, పోతారు… ప్రజలు మాత్రం శాశ్వతమని ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement