Friday, November 22, 2024

AP: అధికారుల్లో హైడ్రా దడ!.. రియల్ గడ్దలపై ‘కుడ’ కొరడా..

నంద్యాలలో 79 లే అవుట్లపై నిషేధం
ఈ భూములు అమ్మొద్దు.. కొనొద్దు
కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ హెచ్చరికలు
ఇటీవల మంత్రి జాగాకు ఎసరే మరో కారణం

ఏపీలో సర్కారు మారింది. రియల్ కథ మాత్రం యథాతథం. కాస్త రంగు మారిందంతే. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. రయ్ రయ్ మంటూ రియల్ గద్దలు వాలిపోతున్నాయి. కొత్త కొత్త వెంచర్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంకేముందీ భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. బోర్డులు వెలిశాయి. సోషల్ మీడియాలో కారు చౌకగా భూములంటూ ప్రచారం హోరెత్తుతోంది. ఇంతలోనే హైదరాబాద్లో చెరువులు, నాలాలను కొల్లగొట్టిన అక్రమార్కుల గుండెల్లో హైడ్రా గునపాలు దిగుతున్న తరుణంలో.. ఏపీ అధికారుల్లో కలవరం ప్రారంభమైంది. అంతే అనధికార లే అవుట్ల ను గుర్తించేస్తున్నారు. ఈ స్థలాలను అమ్మరాదు.. కొనరాదు బోర్డులు కట్టేస్తున్నారు. ఇక అనధికార రిజిస్ర్టేషన్ల కథలకు కళ్లెం వేస్తున్నారు. ఇందులో రియల్ కబ్జా కోరుల కోరల్ని తుంచేందుకు కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడ) కొరఢ విదిల్చింది. నంద్యాల జిల్లా కేంద్రంలో 79 అనధికార వెంచర్లను గుర్తించింది. వీటిలో క్రయవిక్రయాలను నిషేధించింది. ఈ అకస్మిక చర్యలకు కారణమేంటో తెలుసుకుందాం.

ఆంధ్రప్రభ స్మార్ట్, నంద్యాల ప్రతినిధి :

- Advertisement -

నంద్యాల జిల్లా కేంద్రంలో రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా కుడ అధికారులు అక్రమ లే అవుట్లపై కన్నెర్ర చేశారు. నిజానికి నంద్యాల పట్టణంలో ఇప్పటికే భూములకు, ఇండ్ల ప్లాట్లకు, ఖాళీ స్థలాలకు రెక్కలు వచ్చాయి. ఖాళీ స్థలం కనిపిస్తే దర్జాగా కబ్జాకు రియల్టర్లు వాలిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రాజకీయ గద్దలు అనేక ఖాళీ స్థలాల రూపు రేఖల్ని మార్చివేయగా.. తాజాగా కొత్త స్కరారును రియల్టర్లు తమ అడ్డాకు చిరునామాగా మార్చుతున్నాయని జనం ఘోషిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు రియల్ దందాలో మార్పులేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీలో కలకలం సృష్టిస్తున్న ఆక్రమణల పర్వాలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. దీనిపై మున్సిపాలిటీ రీజినల్ డైరెక్టర్ మూర్తి తీవ్రంగా స్పందించారు. అక్రమ లే అవుట్లను గుర్తించాలని ఆదేశించారు. అంతే నంద్యాల పట్టణంలో ఏకంగా 79 అక్రమ లే అవుట్లను అధికారులు గుర్తించారు. సర్వే నంబర్లతో సహా ఈ స్థలాలను ఎవరైనా స్థలం అమ్మినా కొనుగోలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజానికి నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను రియల్టర్లు మింగేశారు.

ఈ స్థలాలు అమ్మవద్దు.. కొనొద్దు : అధికారుల బ్యానర్లు హల్ చల్

తాజాగా కళ్ళు తెరిచిన అధికారులకు 79 అనధికార లే అవుట్ లే కనిపించాయి. ఈ ప్లాట్స్ కు ఎలాంటి అనుమతులు లేవు, కొనుగోలు చేసి ఇబ్బంది పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ బ్యానర్లు కడుతున్నారు. మరో వైపు అనధికార లే అవుట్ ల్లో ప్లాట్ లను కొనుగోలు చేసే వ్యక్తులకు రు ణాలు ఇవ్వద్దని సర్వే నెంబర్లతో సహా బ్యాంకు మేనేజర్లను అప్రమత్తం చేశారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లోని పాఠశాల ఎదురుగా బ్యానర్లు వెలిశాయి. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్, పీవీ నగర్, నందమూరి నగర్, పోన్నాపురం, రైతు నగరం, నూనెపల్లి, ఊడు మాల్ పురం, వెంకటేశ్వరపురం, క్రాంతి నగర్, సలీంనగర్ మూల సాగరం పరిసర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్ లో వేశారని మున్సిపాలిటీ అధికారులు పేర్కొంటున్నారు. సర్వే నెంబర్లు , గ్రామం పట్టణంలోని స్థలాల పేరుతో సహా అనధికార లే అవుట్లను గుర్తించారు. ఎవరైనా స్థలాలు కొనాలనుకుంటే మున్సిపాలిటీ అనుమతి ఉన్న స్థలాలు మాత్రమే కొనాలని సూచించారు.

మంత్రి స్థలానికే ఎసరు ..?

ఇది సరే, వారం రోజుల కిందట ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివాదం నడుస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్థలానికి వి.ఎల్.టి పన్నును కేటాయిస్తూ మున్సిపల్ సిబ్బంది ఇచ్చిన ఉత్తర్వులు దుమారం లేపాయి . ఈ వ్యవహారంలోనలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు బాహాటంగానే వినిపించాయి. మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించి రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అనంతరం అధికారులు ఆ స్థలాలను గుర్తించి రిజిస్ర్టేషన్లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టణం చుట్టు పక్కల భూమి విలువ పెరగటంతో ఈ అక్రమాలకు రెక్కలు వచ్చాయి. అత్యధికంగా పట్టణానికి సమీపంలోని రైతు నగరం ప్రాంతంలో సర్వే నంబర్లలో అక్రమంగా లేఅవుట్ల అధికంగా ఉన్నాయని అధికారులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు స్థలాలు కొనే సమయంలో ఈ మున్సిపాలిటీ కార్యాలయంలో సంప్రదించాలని కమిషనర్ నిరంజన్ రెడ్డి సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement