ఆంధ్రప్రదేశ్‌లో 11 కృష్ణ జింకలను చంపేసిన కేసులో నిందితులను కనిపెట్టింది పోలీసు, ఫారెస్ట్ ఆఫీసర్ల బృందం. ఈ కేసుకు సంబంధించి ఓ గ్యాంగ్ వివరాలను వెల్లడించారు అధికారులు. కర్నూలు జిల్లా ఆదోని తాలుకా నారాయణపురం, కమ్మరి చేడు గ్రామాల సరిహద్దులలో 11 కృష్ణ జింకలను చంపిన కేసులో హైదరబాద్‌కు చెందిన ముఠా సభ్యులను గుర్తించారు. ఈ కేసును కర్నూలు జిల్లా పోలీసులు, ఫారెస్టు అధికారుల దర్యాప్తు బృందం ఛేదించింది. 2022 మార్చి 6వ తేదిన 11 క్రిష్ణ జింకలను వేటాడిన కేసుకు సంబంధించి ఆదోనిలో ఫారెస్టు డిపార్టు మెంట్ వారు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసు, ఫారెస్టు బృందాల జాయింట్ ఇన్విస్టేగేషన్ టీం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
దర్యాప్తులో తెలిసిన విషయం ఏమంటే..
2022 సంవత్సరం మార్చి 5వ తేదీన హైదరాబాద్‌కు చెందిన అయిదుగురు వ్యక్తులు తుపాకులతో కమాండర్ జీప్, ఇన్నోవా కారులో బయలు వచ్చారు. అదే రోజు రాత్రి ఆదోనికి చేరుకుని ఒక హోటల్ బస చేసి మరుసటి రోజు అనగా మార్చి 6వ తేదీన తెల్లవారుజామున 2 వాహనాల్లో జింకల వేటకు బయలుదేరారు. ఆదోని, ఆలూరు మండలాలోని నారాయణపురం, కమ్మరి చేడు గ్రామాల సరిహద్దుల్లోని వ్యవసాయ పొలాలు, చెరువుల చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో రెక్కిచేసి కృష్ణ జింకలను వేటాడారు. తుపాకులతో 11 మగ జింకలను కాల్చి చంపి తలలను కత్తులతో నరికి వేరుచేశారు. ఆ తలలన్నింటిని అక్కడ పడవేసి జింకల చర్మాలను, మాంసాన్ని తీసుకెళ్లారనిదర్యాప్తులో తెలిసింది.
ఈ నేరానికి పాల్పడిన ముఠాలో హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌కు చెందిన వ్యక్తి అయూబ్ ఖాన్ ని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న తుపాకిని స్వాధీనం చేసకున్నారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆలూరు కోర్టులో హజరుపరచగా రిమాండుకు తరలించారు. గ్యాంగులోని మిగత ముఠా సభ్యుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ కేసును త్వరతగతిన ఛేదించిన సీఐలు విక్రమసింహా, శ్రీనివాసులు, పార్థసారథి, ఎస్సైలు నరేంద్రకుమార్ రెడ్డి, మన్మథవిజయ్, గిరిబాబు, పోలీసు సిబ్బంది బషీర్, సుధాకర్, మునీర్ తదితరులను కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ అభినందించారు.