అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం, పధకాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై జగన్ సర్కార్ సీరియస్‌గా ఉంది. సీఎం హోదాలో జగన్‌ను వ్యక్తి గతంగా అదేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వైరల్ అవుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు ఇప్పటికే రంగంలోకి దిగి విచారణ కొనసాగిస్తున్న దర్యాప్తు సంస్ధలు ప్రాధమికంగా నిర్ధారించుకున్నాయి. మరోవైపు పార్టీలతో సంబంధం లేకుండా కూడా సోషల్ మీడియాలో అనుచిత విమర్శలు వైరల్ చేస్తున్న వారిని కూడా గుర్తించడం జరిగింది. ప్రభుత్వ పధకాలైన అమ్మఒడి, వాహన మిత్ర వంటి ప్రతిష్టాత్మక పధకాలకు సంబంధించి ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్న అభియోగంపై ఇప్పటికే సిఐడి అధికారులు పలువురికి నోటీసులు జారీ చేసి విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే.
సిఐడి నోటీసులు అందుకున్న వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలూ ఉన్నారు. అయితే తాజగా పరిణామాల నేపధ్యంలో సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పధకాలైన అమ్మఒడి, వాహనమిత్ర పధకాలు రద్దవుతున్నట్లు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ప్రచారాన్ని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ రకమైన ప్రచారం జరుగుతోందంటూ ఇందులో వాస్తవం లేదని సమాచార కమిషనర్ విజయ్‌కుమార్ తోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఖండించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.