అమరావతి, ఆంధ్రప్రభ : విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని భారీగా తగ్గించటంలో ఏపీ ఇంధనశాఖ విజయం సాధించింది. నెల్లూరు జిల్లాలోని సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈఐఎల్) నుంచి ఏపీ ట్రాన్స్ కోకు అయిదు కిలోమీటర్ల మేర ట్రాన్స్ మిషన్ లైన్ ను విజయవంతంగా పూర్తి చేయటం ద్వారా ఏడాదికి సుమారు రూ 365 కోట్లు ఆదా అయినట్టు ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి కె.విజయానంద్ తెలిపారు.
ఇప్పటివరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో భాగంగా సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈఐఎల్)కు చెందిన నెల్లూరు జిల్లాలోని థర్మల్ పవర్ ప్లాంటు నుంచి ఏపీ ఏపీట్రాన్స్ కో చెందిన రాష్ట్ర గ్రిడ్ కూ, అక్కడి నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా అవుతోంది. పవర్ గ్రిడ్ ట్రాన్స్ మిషన్ లైన్ వినియోగించుకున్నందుకుగాను ఆ సంస్థకు యూనిట్ కు 72 పైసలు చొప్పున ఏపీ ట్రాన్స్ కో చెల్లిస్తోంది.
రోజుకు సగటున రూ కోటి.. ఏడాదికి రూ. 365 కోట్లను ట్రాన్స్ కో దీనిపై వ్యయం చేస్తోంది. ఈ భారం డిస్కంలపైనా, ప్రజలపైనా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సెమ్కార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రం – ఏపీ ట్రాన్స్ కో కు మధ్య ట్రాన్స్ మిషన్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయిదు కిలోమీటర్ల పొడవున ఈ లైన్ నిర్మాణ ప్రాజెక్టు పూర్తికావడంతో మంగళవారం ఏపీ ట్రాన్స్ కో అధికారులు సెమ్కార్ప్ థర్మల్ ప్లాంటు లైనును పవర్ గ్రిడ్ లైన్ నుంచి తప్పించి ఏపీ ట్రాన్స్ కో గ్రిడ్ లైన్ కు అనుసంధానం చేశారు.
దీంతో పవర్ గ్రిడ్ ట్రాన్స్ మిషన్ లైన్లతో సంబంధం లేకుండా నేరుగా ఏపీట్రాన్స్ కో ట్రాన్స్ మిషన్ లైన్ల ద్వారా ఏపీ గ్రిడ్ కూ, అక్కడ నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా అవుతోంది. దీని వల్ల ఒక్కొక్క యూనిట్ కు రూ 1 వంతున ఆదా అవుతుంది. రోజుకు 15 మిలియన్ యూనిట్ల చొప్పున ఏడాదికి సుమారు 5475 మిలియన్ యూనిట్ల విద్యుత్ సెమ్కార్ప్ నుంచి రాష్ట్ర గ్రిడ్ కు సరఫరా అవుతోంది.
దీని వల్ల సగటున రోజుకు రూ 1 కోటి.. సంవత్సరానికి రూ 365 కోట్లు పైగా ఆదా అవుతుంది. స్వల్ప సమయంలో ఈ లైన్ నిర్మాణం పూర్తిచేసి విద్యుత్ వ్యయాన్ని భారీగా తగ్గించినందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.విజయానంద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబులతో పాటు ఇతర అధికారులను మంత్రి పెద్దిరెడ్డి అభినందించారు.