ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా) ప్రభ న్యూస్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో ఇంజనీర్ల బదిలీల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే 29 మంది ఇంజనీర్లను బదిలీ చేసిన ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు శుక్రవారం తాజాగా మరో 70 మంది ఇంజనీర్లను బదిలీ చేశారు. బదిలీ అయిన ఇంజనీర్లు తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు.
విధుల్లో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించి యూనిట్లు నిలిచిపోవడానికి కారణమైన అధికారులను జెన్ కో యాజమాన్యం గుర్తించి చర్యలను ప్రారంభించింది. దీనిపై ఎన్టీటీపీఎస్ లో భారీ ప్రక్షాళన శీర్షికన ఆంధ్రప్రభలో సెప్టెంబర్ 29న ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
ఆంధ్రప్రభ చెప్పినట్లుగానే ఏపీ జెన్ కో ఎండీ చక్రధర్ బాబు భారీ ప్రక్షాళనకు తెరదీశారు. ఏళ్లతరబడి పాతుకుపోయి నిర్లక్ష్యంగా ఉన్న ఇంజనీర్లపై ఆయన సీరియస్ గా ఉన్నారు. ఏపీ జెన్ కో ఎండీ చర్యలతో ఇంజనీర్లు లబోదిబోమంటున్నారు. ఎన్టీటీపీఎస్ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో వరుస బదిలీలు చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. తరువాత యూనియన్ లో పదవులు అడ్డు పెట్టుకుని విధులకు హాజరుకాని నాయకులపై జెన్ కో అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.