Friday, November 22, 2024

తొలి రోజు వేయి మంది జగనన్నకు చెప్పారు….

అమరావతి, ఆంధ్రప్రభ: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్ర మానికి తొలిరోజే ప్రజల నుండి విశేష ఆదరణ లభిచింది. ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఒక దశలో ఫోన్‌ కాల్స్‌ కలవక ఫిర్యాదు దారులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు నాలుగు గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా కాల్స్‌ వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇకపై కూడా ఇదే పరంపర కొనసాగే అవకాశమున్నట్లుగా వారు పేర్కొనడం విశేషం. ఈకార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. దీంతో1902 ఫోన్‌ కాల్‌ అందుబాటులోకి వచ్చింది. మధ్యాహ్నం నుండి సాయంత్రం 6 గంటల వరకూ సుమారు వెయ్యికి పైగా కాల్స్‌ వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ విధంగా అందిన ఫిర్యాదులను శాఖల వారీగా వేరుచేసేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా మోనటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుండి వచ్చిన కాల్స్‌ వచ్చినట్లే సంబంధిత శాఖలకు అధికారులు స్పాట్‌లో బదలాయిస్తున్నారు. సామాన్య ప్రజల నుండి అందుకున్న ఫిర్యాదును సీఎం దగ్గర నుండి సంబంధిత శాఖ ప్రధాన కార్యదర్శికి, అక్కడ నుండి కమిషనర్‌కు, అక్కడ నుండి జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్లకు, అక్కడ నుండి మండలానికి, అక్కడ నుండి గ్రామ, వార్డు సచివాలయాలకు అత్యంత వేగంగా పంపేశారు. అందుకు సంబంధించి మెస్సేజ్‌ రూపంలో ఫిర్యాదు దారుడికి సమాచారం అందించారు. పిర్యాదు దారుడు చేసిన పిర్యాదుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని క్షణాల్లో తెప్పించుకునేలా ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించి ఏమైందన్న విషయాన్ని కూడా వెంటనే సీఎం డాష్‌ బోర్డులో ఉంచుతున్నారు. ఈ తంతంగం అంతా సీఎం జగన్‌ కూడా నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.

గంటల వ్యవధిలోనే వెయ్యి కాల్స్‌
ఏళ్ల తరబడి తమ సమస్యల పరిష్కారం కోసం తిరుగుతున్న అనేక మంది 1902కు కాల్స్‌ చేవారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే దాదాపు వెయ్యి కాల్స్‌ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. స్పందనలో అర్జీలు పెట్టినా పరిష్కారం దొరకని సమస్యలే ఇందులో అధికంగా వచ్చాయని తెలుస్తోంది. స్పందనలో నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారం అవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రతి సమస్యకు ఒక టైం బౌండ్‌ నిర్ణయించి ఆ సమయంలోగా దానిని పరిష్కరించాల్సి ఉంది. లేని పక్షంలో అ సమస్య సీఎం డాష్‌ బోర్డులో కనిపిస్తూనే ఉంటుంది. దీంతో అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. కానీ, ఇప్పుడు ఆ చొరవ మరింత పెంచేలా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా సీఎంకు తమ సమస్యను చెప్పుకునే అవకాశం కల్పిచడంతో ప్రజలు పెద్ద ఎత్తున టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే దాదాపు వెయ్యికిపైగా కాల్స్‌ రావడం మామూలు విషయం కాదని అధికారులు చెబుతున్నారు.

ఆ మూడు శాఖలపైనే ఎక్కువ
ఇదిలా ఉండగా తొలి రోజు అందిన ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ, పోలీస్‌, పెన్షన్లు వంటివాటిపైనే అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది. తొలి రోజు ఎన్ని కాల్స్‌ వచ్చాయన్నదానిపై ప్రభుత్వం తరపునుండి సాయంత్రం వరకూ ఎటువంటి సమాచారం విడుదల చేయలేదు. కానీ, ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు రెవెన్యూ, పోలీస్‌ శాఖలపై పెద్ద సంఖ్యలో ప్రజలు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. కొంత మంది అవినీతి అధికారులమీద కూడా పెద్ద ఎత్తున చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఏసీబీ దాడులపైనా కొంత మంది చెప్పారని సమాచారం. వ్యవస్థలో మొత్తం అవినీతి అధికారులే ఉండరని, కానీ అవినీత అధికారుల సమాచారం సేకరించి వారి భరతం పట్టకపోవతే వ్యవస్థపై దాని ప్రభావం అధికంగా ఉంటుందని కూడా కొంత మంది చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

రాజకీయ ఫిర్యాదులు వచ్చాయ్‌
ఇదిలా ఉండగా ఈ నంబర్‌కు కాల్‌ చేసిన కొంత మంది తమ ప్రాంతంలో రాజకీయ నేతల తీరుపై కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రికార్డింగ్‌ అవుతుంది కాబట్టి తమ సమస్య తమ ప్రియతమ నేతకు తెలుస్తుందని భావించే వారు కాల్స్‌ చేసినట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న నేతలే ఎక్కువగా ఈకాల్స్‌ చేశారని అంటున్నారు. ఆది నుండి పార్టీ జెండా మోసిన తాము పార్టీకి దూరంగా ఉంటున్నామని, తమపై సొంత పార్టీవారే కేసులు పెట్టారని కొంత మంది, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని మరికొంత మంది ఇలా రకరకాలుగా ఫిర్యాదు చేసినట్లు చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య చర్చ జరిగింది. తాము చేసిన ఫిర్యాదుల గురించి అసమ్మతి నేతలు తమ వర్గం వద్ద చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏం చేసినా సంచలమే
సీఎం జగన్‌ ఏం చేసినా అది సంచలనంగానే మారుతోంది. తొలి ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకూ ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ వినూత్నంగానే ఉన్నాయి. నవరత్నాల పేరుతో అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం నిరుపేదలకు అండగా మారింది. ఈక్రమంలోనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాజకీయ పక్షాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆయన తీసుకున్న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి కూడా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌చేసి తసమస్యలు నేరుగా సీఎంవోకు తెలియజేస్తున్నారు. ఇది రాజకీయాల్లో ఒక విప్లవాత్మక మార్పుగా రాజకీయ నేతలు చెబుతున్నారు.

రాజకీయ ఆరోపణలకు చెక్‌ పడేలా
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన తొలి రోజే అటు తెదేపా, ఇటు భాజాపాలు విమర్శలు గుప్పించాయి. ఎక్కడ సమస్యలు లేవని ప్రత్యేకంగా చెప్పాలని తెదేపా ప్రశ్నించగా ప్రజా ధనం దుర్వినియోగానికి తప్ప మరెందుకంటూ భాజాపా నిలదీసింది. ఈ ఆరోపణల నడుమ ప్రారంభమైన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున మద్దతు పలికారు. తమతమ సమస్యలను వెల్లువలా 1902కు కాల్‌చేసి చెప్పారు. సమస్య ఏదైనా తమ బాధను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చెప్పుకునే అవకాశాన్ని మాత్రం ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఇదే తరహాలో తరువాతి రోజుల్లూనూ ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదుల పెద్ద సంఖ్యలో వెల్లువెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement