Wednesday, October 2, 2024

వరి వదిలేద్దాం.. పంట మార్చేద్దాం.. ప్రత్యామ్నాయ పంటలకు రబీలో భారీ ప్రోత్సాహకాలు

సుస్థిర వ్యవసాయం.. ఇటీ వల కాలంలో దేశవ్యాప్తంగా వినబడుతున్న పేరు ఇదే. కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగ సారాంశం కూడా ఇదే. సేంద్రియ విధానం.. ప్రత్యామ్నాయ పంటలు.. సాగు విస్తీర్ణంలో సమతుల్యత.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు.. ఇవీ స్థూలంగా సుస్థిర వ్యవసాయ లక్ష్యాలు. దీనిలో భాగంగా రాష్ట్రంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలు అందిస్తోంది. ఇప్పటిదాకా ప్రధాన ఆహారపంట వరి సాగయిన భూముల్లో చిరు ధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తోంది. ఖరీఫ్‌, రబీలో రెండేళ్ళలో నాలుగు సీజన్లలో రాష్ట్రంలోని 3 లక్షల ఎకరాల వరి భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు పండించాలని లక్ష్యంగా నిర్ణయించింది.

దీనిలో భాగంగా ఇపుడు కొనసాగుతున్న 2021-22 రబీ సీజన్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 30,750 ఎకరాల్లో ప్రత్యామ్నాయ సాగు చేపట్టేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. రబీ సీజన్‌లో వరికి బదులు ఆరుతడి పంటలైన అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు సాగు చేపట్టే రైతులకు ప్రభుత్వం రూ.11.28 కోట్ల భారీ సబ్సిడీని ప్రకటించింది. గ్రామా గ్రామానికి వెళ్లి రైతులకు అవగాహన తరగతులు నిర్వహించటంతో పాటు ప్లెక్సీలు, హోర్డింగులు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా రైతు గ్రూపులను ఏర్పాటు చేసి ఆడియో, వీడియో సందేశాలు పంపిస్తున్నారు.

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు పండిస్తే స్పింక్లర్ల కోసం హెక్టారుకు రూ 15 వేల సబ్సిడీని ప్రకటించింది ప్ర‌భుత్వం. పొద్దుతిరుగుడు, వేరుశెనగ తదితర నూనెగింజ పంటలకు రూ.10 వేల విలువైన విత్తనాలను కూడా అందిస్తున్నారు. చిరుధాన్యాలకు రూ.6 వేలు, అపరాలకు రూ.9 వేల విలువైన విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. చిన్న కమతాలున్న రైతులు ఫార్మర్‌ ఇంట్రస్ట్‌ గ్రూపు (ఎఫ్‌ఐజీ)లుగా ఏర్పడితే రూ.1.25 లక్షల రాయితీతో 3.లక్షల విలువైన దాల్‌ మిల్‌ ప్రాసెసింగ్‌ మిషన్లను అందించి ప్రోత్సా హించేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. రబీ సీజన్‌ లో ఎఫ్‌ఐజీ గ్రూపులకు 50 మిషన్లను అందించేందుకు నిధులు సమకూరుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement