Saturday, September 21, 2024

Big Story | వెదురుసాగుకు భారీ ప్రోత్సాహకాలు.. ప్రభుత్వ భూముల్లో సాగుకు 100 శాతం సబ్సిడీ

అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న బాంబూ (వెదురు) మిషన్‌ అమలు వేగవంతమవుతోంది. అటవీ ప్రాంతాల్లో పెంపకానికే పరిమితమైన వెదురు సాగును సాధారణ పంటలు పండే గ్రామాలకూ, మైదాన ప్రాంతాలకు కూడా విస్తరింపచేసే లక్ష్యంతో ప్రభుత్వం మూడేళ్ళ ప్రణాళికను అమలు చేస్తోంది. 2022-23లో లో 500 హెక్టార్లలో కొత్తగా వెదురు సాగు చేపట్టాలని నిర్ణయించి అమలు చేయగా 2023-24లో 1500 హెక్టారక్లు, 2024-25లో మూడు వేల హెక్టార్లలో కొత్తగా సాగును విస్తరింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేవలం సాగు విస్తరణ కోసం చేపట్టే చర్యల అమలుకు రూ.10 కోట్లతో ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించగా రైతులకు రాయితీలు, సబ్సిడీలు అందించి ప్రోత్సహించేందుకు రూ 1184 కోట్లతో బాంబూ మిషన్‌ ను ఏర్పాటు చేశారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు రూ 710 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 40 శాతం నిధులు రూ.473 కోట్లను కేటాయించారు. అటవీ ప్రాంతం తోపాటు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూములు, ప్రైవేటు భూములు, కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లుకు సంబంధించిన గట్లపై కూడా పెద్దఎత్తున వెదురు సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించేయాలని నేషనల్‌ బాంబూ మిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గానిర్దేశం చేస్తోంది.

- Advertisement -

దీనిలో భాగంగా సాగు విస్తరణ, ప్రోత్సాహకాలు, అవకాశాలను మరింత పెంపుదల చేసేందుకు వీలుగా ఇంతకాలం అటవీశాఖ పరిధిలో ఉన్న వెదురుసాగును ప్రభుత్వం ఉద్యానశాఖలో విలీనం చేయటమే కాకుండా యాక్షన్‌ ప్లాన్‌ అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీని కూడా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో ఏపీ వ్యవసాయ మిషన్‌ చైర్మన్‌, వ్యవసాయ, ఉద్యానశాఖ కమిషనర్లతో పాటు అటవీ, పర్యావరణ, పరిశ్రమ శాఖల కార్యదర్శులు వైస్‌ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. వెదురుసాగు చేపట్టే రైతులందరూ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బ్యాంబూ డెవలప్మెంట్‌ ఏజెన్సీ (బీడీఏ)ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వెదురు మొక్కకు మూడేళ్ళకు రూ.240 ఖర్చవుతుందని అంచనా.

మొక్క నాటిన తొలి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 30 శాతం, మూడో ఏడాది 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వభూముల్లో చేపట్టే సాగుకు నూటికి నూరు శాతం సబ్సిడీ అందనుంది. ఆక్వా చెరువులతో పాటు పండ్ల తోటలు, ఇతర పొలాలకు కంచెలు ఏర్పాటు చేసిన చోట వాటి చుట్టూతా వెదురు సాగు చేపట్టినా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుంది. వెదురు మొక్కలు, పెంపకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నర్సరీలకు కూడా 40 శాతం సబ్సిడీ అందివ్వాలని కమిటీ నిర్ణయించింది. రూ.7.5 లక్షలతో ఏర్పాటు చేసే వాటిని చిన్న నర్సరీలుగా, రూ.15 లక్షల పెట్టుబడి వ్యయంతో కూడిన వాటిని పెద్ద నర్సరీలుగా భావించి 40 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించారు.

ఒక్కసారి వెదురు మొక్కను నాటి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 70 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది.. 50 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు మొక్క పెరుగుతుంది. మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచే ప్రతి సంవత్సరం 25 నుంచి 30 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో వెదురుకు మంచి డిమాండ్‌ ఏర్పడింది.. నిర్మాణ రంగంతో పాటు కాగితపు పరిశ్రమ, అగరబత్తీల తయారీ, ఫర్నిచర్‌, హేండీ క్రాప్ట్స్‌, ఫైబర్‌ తయారీలో వెదురు వినియోగం అధికమవుతోంది.. తొలి ఏడాది సుమారు రూ 60 వేలు, ఆ తరువాత ఏటా సుమారు రూ.10 వేలు పెట్టుబడి పెట్టి వెదురుసాగు చేపడితే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందటంతో పాటు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement