కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు, పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ వేయిస్తంభాల దేవాలయం, రామప్ప రామలింగేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అటు కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో మహిళలు దీపాలను వదిలారు. ఆలయాల్లోనూ మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలతో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. అటు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, వాడపల్లి అగైస్థశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. నదీ తీర ఆలయాల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..