Sunday, November 24, 2024

AP | విశాఖలో కోటిన్నర నగదు పట్టివేత

  • కారులో కోటిన్నర నగదు తరలింపు
  • ఆర్కే బీచ్ పాండురంగపురం లో కలకలం రేపిన నగదు
  • పట్టుకున్న జిల్లా ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్
  • నిందితుల పరారీ
  • అణువణువున గాలిస్తున్న త్రీ టౌన్ పోలీసులు
  • మరో 20 గంటల్లో ఎన్నికల సమరం.

విశాఖ క్రైం, (ప్రభ న్యూస్) : విశాఖ నగరంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది. సుమారు కోటిన్నర రూపాయల నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది. విశాఖలోని బీచ్ కు సమీపంలో గల పాండురంగపురంలో కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును సి విజిల్ ఫిర్యాదుతో డిస్టిక్ ఫ్ల‌యింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి పట్టుకుంది. ఆ కారులో నగదును గుర్తించడంతో కారు వదిలి నిందితులు పరారయ్యారు.

ఓటర్లను ప్రలోబతం చేసేందుకు ప్రయత్నాలు.

ఇప్పటికే విశాఖ నగరంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు రూ.1000ల నుంచి రూ.2000ల వరకు ఓటు రేటు పలుకుతుంది. అదే సీనియర్ కార్యకర్తలకైతే రూ.5000ల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కచ్చితంగా గెలవాలనే తాపత్రయంతో ఓటర్లను ప్రలోబాల‌కు గురిచేస్తున్నారు.

- Advertisement -

తమ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి కూడా భారీగా నగదు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పాండురంగపురం వద్ద కోటిన్నర రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొన్న సౌత్ లో రూ.67 లక్షలు నిన్న నార్త్ లో ఇన్ కం టాక్స్ రూ.7కోట్లకు పైగా… నేడు తాజాగా కోటిన్నర నగదు సీజ్ చేయడం జరిగింది.

త్రీటౌన్ పోలీసులకు డిస్టిక్ ఫ్ల‌యింగ్ స్క్వాడ్ అధికారులు నగదును అప్పగించారు. త్రీటౌన్ సీఐ పార్థసారథి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరో 20గంటల్లో పోలింగ్ కావడంతో పోలీసులు అణువణువునా జల్లెడ పడుతున్నారు.

పారదర్శక, ప్రశాంత ఎన్నికల నిర్వహణ..సీపీ రవిశంకర్

ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని అడిషనల్ డి.జి.పి, క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్.ఏ.రవి శంకర్ తెలిపారు. పారదర్శక, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు నగర పోలీసు శాఖ సర్వం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోలింగుకు 48గంటల ముందు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు, నగర ప్రజలూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిపి మాట్లాడుతూ…. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నగర వ్యాప్తంగా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పరిస్థితులు, పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ పరిసరాలలో 144 సెక్షన్, అలాగే 30 పోలీస్ యాక్టులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. పోలీసులు సమయస్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వహిస్తూ, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా చివరి క్షణం వరకూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడం జరుగుతుందన్నారు. బారికేడింగ్ ఉండేలా క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలని, మహిళలు, వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement