Monday, December 9, 2024

AP | భారీగా గంజాయి స్వాధీనం.. 17మంది అరెస్ట్.. ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): జిల్లాలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 17మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు గురువారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి వన్ టౌన్, టూటౌన్, రూరల్, బీఎన్ కండ్రిగ సీఐలు మూడు బృందాలుగా విడిపోయి పలుచోట్ల తనిఖీలు చేపట్టారు.

శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ సమీపంలోని బృందమ్మ కాలనీ పక్కన ఉన్న ఖాళీ ప్లాట్స్ వద్ద, శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ పనసకోన మండపం వద్ద, తొట్టెంబేడు పోలీస్ స్టేషన్ పరిధి పెద్ద కనపర్తి గ్రామం వద్ద ఉన్న స్వర్ణముఖి బ్రిడ్జి క్రింద దాడులు చేశారు. ఈ తనిఖీల్లో నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే 17 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 32 కేజీలల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

- Advertisement -

తిరుపతి మీదుగా తరలింపు..
అరకు, పాడేరు నుంచి తిరుపతి జిల్లా మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకు రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంజాయి టాస్క్ ఫోర్సు బృందాలు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో బుధవారం ఒకే రోజు 17 మంది పట్టుబడ్డారు. ఇందులో శ్రీకాళహస్తికి చెందిన వారు 14 మంది, వెంకటగిరికి చెందిన వారు ఇద్దరు, పాడేరు జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. వీరంతా బయట ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు పట్టుబడ్డారు.

గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం..
ఇప్పటికే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపామని, అలాగే అమ్మేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాత నేరస్తులపై కూడా నిఘా ఉంచామని, గంజాయి కేసులు ఉన్నవారిపై పీడీ యాక్టు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి రవాణాను ఎట్టి పరిస్థితులలో కూడా ఉపేక్షించేది లేదన్నారు. గంజాయి కట్టడికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు చురుకుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గంజాయి రహిత జిల్లాగా తిరుపతి జిల్లాను తీర్చిదిద్ధడమే తమ లక్ష్యమని అన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి విక్రయాలు, తరలింపుపై సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

పోలీసులకు అభినందనలు..
గంజాయి విక్రేతలను అరెస్ట్ చేయడానికి కృషి చేసిన శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, శ్రీకాళహస్తి 1 టౌన్ సీఐ గోపి, టూ టౌన్ సీఐ వెంకటేష్, శ్రీకాళహస్తి రూరల్ సీఐ యం.రవినాయక్, బీఎన్ కండ్రిగ సీఐ తిమ్మయ్య, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, సిబ్బంది హేమాద్రి, శంకరయ్య, ప్రసాద్, బాలకృష్ణ, గంగాధరం, భరత్, హరీష్, నాగభూషణం, బాబు, నరేష్, ప్రవీణ్‌ను ఎస్పీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement