అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : రాజధాని అమరావతిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు హడ్కో సంసిద్ధత వ్యక్తం చేసింది.. సుమారు పదెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో హడ్కో చైర్మన్, ఎండీ సంజయ్ కుల్‌శ్రేష్ట తదితర ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో హడ్కో రాజధాని నిర్మాణానికి ఇటీవల రూ. 11వేల కోట్ల రుణాలిచ్చేందుకు ముందుకు రావటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. రాజధాని అమరావతికిది శుభ పరిణామమన్నారు. దీంతో పాటు అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయటం ఆనందంగా ఉందన్నారు. హడ్కో చైర్మన్‌తో భేటీని తన ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు.
రాజధాని పునర్నిర్మాణానికి పునాదిరాయి పడిన మరుక్షణం నుంచే అమరావతిపై ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.. ముందు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు రూ. 15వేల కోట్ల రుణాలిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన సంగతి విదితమే. డిసెంబర్‌లోగా తొలివిడత రుణాలు అందించేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధమవుతోంది.. ఇందుకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులను కేంద్రం నుంచి సేకరించింది.
ఈ నేపథ్యంలో హడ్కో ఎన్ని దశల్లో రుణాలు మంజూరు చేస్తుందనే విషయమై ముఖ్యమంత్రి సంస్థ చైర్మన్‌తో చర్చించారు. ప్రపంచ బ్యాంక్‌తో పాటు హడ్కో ఇచ్చే రుణంతో కలుపుకుని రూ. 26వేల కోట్లతో ప్రభుత్వ భవనాలు, వీవీఐపీల నివాస సముదాయాలు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.. కాగా జాతీయ సంస్థలతో పాటు ఇతర వ్యాపార, ఐటీ సంస్థలు అమరావతిలో ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం సంప్రతింపులు జరుపుతోంది.