Monday, November 18, 2024

AP | గన్నవరం నుండి మరో విమానం…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి దేశ రాజధాని ఢిల్లీని కలిపేందుకు మరో నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలలో ఇండియన్ ఎయిర్లైన్స్ గన్నవరం నుండి ఢిల్లీకి సర్వీసును ప్రారంభించగా, తాజాగా ఇండిగో కూడా తన విమాన సర్వీసులు శుక్రవారం నుండి ప్రారంభించింది.

విజ‌య‌వాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో స‌ర్వీసు విజ‌య‌వాడ నుంచి ముంబై కి ప్రారంభ‌మయ్యాయి. ఏపీ రాజధాని నుండి దేశ రాజధానితో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్న ఎంపి కేసినేని చిన్ని అతి త్వరలోనే మరికొన్ని సర్వీసులు అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు.

తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ స‌ర్వీసును ఎయిర్ పోర్ట్ అథారిటీ చైర్మ‌న్ హోదాలో ఎంపి వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి, ఎయిర్ పోర్ట్ అథారిటీ వైస్ ఛైర్మ‌న్ హోదాలో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు ల‌తో క‌లిసి ప్రారంభించారు.

ఈ సంధ‌ర్భంగా ఎయిర్ పోర్ట్ లోని డొమిస్టిక్ టెర్మిన‌ల్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి, ఎయిర్ పోర్ట్ డైరెక్ట‌ర్ ఎమ్.ల‌క్ష్మీకాంత్ రెడ్డి తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. అనంత‌రం ప్ర‌యాణీల‌కు బోర్డింగ్ పాస్ లు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ రెండు నెల‌ల క్రితం ఎయిరిండియా సంస్థ ముంబైకి విమాన స‌ర్వీసు ప్రారంభించ‌గా, ఇప్పుడు ఇండిగో సంస్థ వారు ముంబై విమాన స‌ర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావ‌టం ఎంతో ఆనందంగా వుంద‌న్నారు.

రాజ‌ధాని ప్రాంతంలోని ప్ర‌యాణీకుల అవ‌స‌రాల‌ను దృష్టిలోపెట్టుకుని ఎంపి బాల‌శౌరితో క‌లిసి కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రిని దేశంలోని ప‌లు ప్రాంతాల‌కు క‌నెక్టివిటి విమానాల‌ను న‌డ‌పాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. అహ్మాదాబాద్, పుణే, క‌ల‌క‌త్తా, వార‌ణాశి వంటి ప్రాంతాల‌కు ప్ర‌తి నెల ఒక్కో విమాన స‌ర్వీసు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కృషి చేస్తున్నార‌ని చెప్పారు.

- Advertisement -

అలాగే సెప్టెంబ‌ర్ 14వ తేదీ నుంచి విజ‌య‌వాడ – ఢిల్లీకి ఇండిగో కి చెందిన విమాన స‌ర్వీస్ ప్రారంభం కానున్న‌ట్లు చెప్పారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో కార్గో టెర్మిన‌ల్ ను అభివృద్ది చేసే విధంగా కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. రాజ‌ధాని ప్రాంతంలోని వ్యాపార‌స్తుల అవ‌స‌రాల గుర్తించి ఈ స‌ర్వీసులు ప్రారంభమ‌య్యేందుకు స‌హ‌క‌రించిన కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కి , ఇండిగో సంస్థ‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అంత‌కంటే ముందు ఎంపి బాల‌శౌరి మాట్లాడుతూ ఎన్డీయే ప్ర‌భుత్వంలో విజ‌య‌వాడ విమానాశ్ర‌యం అభివృద్ది ప‌నులు చాలా వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌న్నారు. ఈ విమానాశ్ర‌యం ప‌ర్మినెంట్ టెర్మిన‌ల్ పూర్తి కాబోతుంది. ఆ టెర్మిన‌ల్ పూర్తి అయిన వెంట‌నే వివిధ దేశాల‌కు విమాన‌స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని, ఇందుకోసం కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ఎంతో స‌హ‌కారం అందిస్తున్నార‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement