విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు చెందిన విశాఖ రిఫైనరీ విస్తరణ పనులపై లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలివ్వాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఫిబ్రవరి 10న జరిగే తదుపరి విచారణ తేదీ నాటికి సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేసి, వాదనలకు సిద్ధం కావాలని ఆదేశించింది. విశాఖ రిఫైనరీ కాలుష్యంపై అప్పటికే ఎన్జీటీలో కొనసాగుతున్న కేసులో, విశాఖపట్నంకు చెందిన గంగరాజు దాఖలు చేసిన ఇంటరిమ్ అప్లికేషన్‌పై బుధవారం చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున రిపైనరీ విస్తరణకు అనుమతి ఇవ్వకూడదంటూ పిటిషనర్ కోరారు. రిఫైనరీలో తగినన్ని కాలుష్య నియంత్రణ చర్యలు లేవని కమిటీ ధృవీకరించిందని పేర్కొన్నారు. పర్యావరణ నిబంధనల ప్రకారం 33 శాతం పచ్చదనం ఉండాలని, కానీ కమిటీ అధ్యయనంలో లేదని లేదని తేలిందని తెలిపారు. అలాగే ప్లాంటు నుంచి వస్తున్న దుర్వాసనపై కూడా తగిన చర్యలు తీసుకోలేదని కమిటీ నివేదికలో తేల్చిందని పిటిషనర్ చెప్పారు. అన్ని రకాలుగా పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కమిటీ పేర్కొందని, ఈ క్రమంలో రిఫైనరీ విస్తరణకు అనుమతులు ఇవ్వొద్దని అభ్యర్థించారు.
అయితే తమ వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం కల్పించాలని హెచ్‌పీసీఎల్ ధర్మాసనాన్ని కోరింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసిన ఎన్జీటి, కౌంటర్ దాఖలుకు హెచ్‌పీసీఎల్‌కు అనుమతించింది. పూర్తి వివరాలతో ఫిబ్రవరి 10వ తేదీన వాదనలకు సిద్ధం కావాలని ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..