Wednesday, November 20, 2024

Big story: బతుకు బండి సాగెదెలా?.. ధరాఘాతంతో కష్టాల్లో మధ్య తరగతి కుటుంబాలు

అమరావతి, ఆంధ్రప్రభ : మధ్య తరగతి కుటుంబాల జీవనం నానాటికీ దుర్భరంగా మారుతోంది. పెరుగుతున్న ఖర్చులతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలతో మధ్య తరగతి ప్రజలు తమ బతుకు బండి ఎలా నడుస్తుందో అర్థం కాక సతమతమవుతున్నారు. ముఖ్యంగా రోజురోజుకీ నిత్యావసరాల ధరల పెరుగుదల మధ్య తరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. గడిచిన రెండేళ్లుగా అన్ని రకాల నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మధ్య తరగతి ప్రజల ఆదాయాల్లో మాత్రం మార్పు లేకపోవడంతో బడ్జెట్‌ పూర్తిగా తలకిందులవుతోంది. ఇదే సమయంలో బడ్జెట్‌కు మించిన ఖర్చులు అవుతుండటంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్న ఆవేదన మధ్య తరగతి వర్గాల నుంచి వినిపిస్తుంది.

మరోవైపు పిల్లల చదువులు కూడా ఈ కుటుంబాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రభుత్వం చేయూతనిస్తున్నా.. ధరలు మాత్రం అదుపులోకి రాకుండా రోజురోజుకీ కొండెక్కుతుండటంతో మధ్య తరగతి కుటుంబాలు మానసిక ఆవేదనకు లోనవుతున్నాయి. ఒకవైపు నిత్యావసరాల పెరుగుదల, మరోవైపు స్కూలు, కళాశాలల ఫీజుల భారం తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తున్నాయి. ఎంత పొదుపుగా జీవనం సాగించాలని ప్రయత్నాలు చేస్తున్నా పెరుగుతున్న ఖర్చులు వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని కుటుంబాలు తమ వ్యక్తిగత అవసరాలను, వినోదాలు ఇతర ఫంక్షన్లకు దూరంగా ఉండే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మధ్య తరగతి వర్గాల జీవనంపై మరింత ఒత్తిడిని తీసుకువచ్చింది. వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినడం, ఉపాధి సక్రమంగా లేకుండా పోవడం కూడా మధ్య తరగతి వర్గాల జీవనాన్ని దెబ్బతీసింది.

మధ్య తరగతి కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ శ్రమిస్తున్నా జీవితం మాత్రం సాఫీగా సాగని పరిస్థితి నెలకొంది. ఇంకొకవైపు విద్యుత్‌, బస్‌ ఛార్జీలు, పెట్రోల్‌, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో మధ్య తరగతి బతుకుబండి కష్టాల్లో పడింది. రెండేళ్ల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు ఆ ధరలు రెట్టింపు స్థాయికి చేరడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. రెండేళ్ల క్రితం ఉన్న ధరలను పరిశీలిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ. 83 ఉంటే.. ఇప్పుడు రూ. 110కి చేరింది. ఇక వంటగ్యాస్‌ సిలిండర్‌ రూ. 600 ఉండగా.. అది ఇప్పుడు రూ. 1075కు, కందిపప్పు రూ. 80 నుంచి రూ. 130కు, చింతపండు రూ. 160 నుంచి రూ. 280కు, వంటనూనె రూ. 95 నుంచి రూ. 160కు చేరగా విద్యుత్‌ ఛార్జీలు కూడా దాదాపు రెట్టింపైన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ గమనిస్తే ఒకొక్క మధ్య తరగతి కుటుంబంపై రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు అదనపు భారం కేవలం నిత్యావసరాల పైనే పడుతుందంటే ఇక స్కూల్‌ ఫీజులు, ఇతర ఖర్చులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్య తరగతి వర్గాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి పరిస్థితి కొద్దిగా నయంగా చెప్పుకోవచ్చు. ధరలు, ఛార్జీల పెరుగుదల అందరికీ వర్తించినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే మధ్య తరగతి వర్గాలకు అద్దెల భారం అధికంగా ఉంది. చిన్న కుటుంబంతో నివాసం ఉండాలంటే కనీసం రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రతి ఏడాది పది నుంచి 20 శాతం వరకు ఇంటి యజమానులు అద్దె పెంచుతూ వస్తుండటం కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

గడిచిన రెండేళ్లుగా ధరల్లో ఇంత వ్యత్యాసం ఉంటే తమ వేతనాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదన్న ఆవేదన మధ్య తరగతి వర్గాల నుంచి వినిపిస్తోంది. కరోనా తర్వాత ఉన్న పరిస్థితుల్లో వారంలో కేవలం 5 రోజులు మాత్రమే ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా కరోనాతో అనేక రంగాలు దెబ్బతినడం వల్ల ఉపాధి దొరకడమే కష్టంగా మారిందని ఇంక వేతనాల పెరుగుదల ఎలా ఉంటుందన్న ప్రశ్న మధ్య తరగతి కుటుంబాల నుంచి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడితే కొంతైనా ఉపశమనం తమకు లభిస్తుందన్న ఆశాభావం మధ్య తరగతి కుటుంబాల నుంచి వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement