Saturday, November 23, 2024

Big Update: గౌతంరెడ్డి శాఖల భర్తీ ఎలా ?!.. సమర్ధులకే కట్టబెట్టే యోచనలో జగన్​

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : కీలకమైన ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ పనిచేసే మంత్రిగా పేరు తెచ్చుకున్న దివంగత మేకపాటి గౌతమ్‌ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు సీఎం జగన్‌ కసరత్తు మొదలు పెట్టారు. ఆయన నిర్వహిస్తున్న శాఖలు అత్యంత కీలకమైనవి కావడం, వాటిలో ప్రధానంగా పరిశ్రమలు, ఐటీ శాఖలు కూడా ఉండటంతో వీలైనంత త్వరలో ఆలోటును భర్తీచేసి కేబినెట్‌లో సమర్ధులైన వారికి అప్పగించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సందర్భంలో మేకపాటి కుటుంబానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చేలా సీఎం జగన్‌ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ముందుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డికి అప్పగించినట్లు చెబుతున్నారు. వచ్చే నెల మూడో తేదీ గౌతమ్‌ రెడ్డి ఉత్తర క్రియల కార్యక్రమం ముగిసిన తరువాత జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, ఇతర సీనియర్‌ నేతలతో సజ్జల భేటీ కానున్నారు. ఈబేఠీలో మేకపాటి కుటుంబానికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇవ్వాల్సిన ప్రాధాన్యత, తదితర అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను ఆయన సీఎం జగన్‌కు తెలియపర్చనున్నారు. వీలైనంత త్వరలోనే మేకపాటి కుటుంబం విషయంలో ఓ నిర్ణయం తీసుకుని ఉప ఎన్నికల్లో ఆకుటుంబం నుండి ఒకరు పోటీచేసేలా అవకాశం కల్పించడంతోపాటు సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌ రెడ్డికి ప్రభుత్వంలో కీకలమైన పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.

మేకపాటి కుటుంబానికి ప్రాధాన్యం
మేకపాటి రాజమోహన్‌ రెడ్డి రాజకీయ వారసుడిగా దివంగత గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రంచేసి ఆత్మకూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా వరుసగా రెండు సార్లు పోటీచేసి గెలుపొందారు. ఈనేపథ్యంలోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్‌ కేబినెట్‌లో ఆయనకు కీకలమైన శాఖలు అప్పగించారు. ఐదు శాఖల మంత్రిగా కూడా గౌతమ్‌ రెడ్డి పేరుతెచ్చుకున్నారు. సీఎం జగన్‌ తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన అన్ని శాఖలకు న్యాయం చేస్తూ తన కుటుంబ ప్రాధాన్యతను ప్రభుత్వంలో మరింతపెంచుకుంటూ వచ్చారు. ఈనేపథ్యంలో ఆయన అకాలమరణం ఇటు ప్రభుత్వానికి, అటు మేకపాటి కుటుంబానికి తీరని లోటుగా మారింది. అయితే, ఆలోటును భర్తీచేసేందుకు సీఎం జగన్‌ కసరత్తు మొదలు పెట్టారు. ఆత్మకూరుకు జరిగే ఉప ఎన్నికల్లో గౌతమ్‌ రెడ్డి సతీమణి శ్రీకీర్తికి పోటీచేసే అవకాశం కల్పించాలా..లేక రాజమోన్‌ రెడ్డిని ఒప్పించి రంగంలోకి దించాలా..అనే అంశంపై సీఎం జగన్‌ మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే, 2019 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుండి పోటీచేసే అవకాశమున్నా రాజమోహన్‌ రెడ్డి అప్పట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉన్నారు. ఆకుటుంబం నుండి మేకపాటి చంద్రశేఖర రెడ్డి, మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుండి పోటీచేసి గెలుపొందారు. వారి గెలుపులో రాజమోహన్‌ రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేశాక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచయడమే తప్ప తమ కుటుంబ సభ్యులకోసం పోటీ నుండి తప్పుకుని ప్రచారం చేసింది కూడా ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. వీటిని దృష్టిలో ఉంచుకుని పెద్దాయనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్‌ యోచనగా చెబుతున్నారు. ఆయన్ను ఉప ఎన్నికల్లో ఆత్మకూరు నుండి బరిలోకి దించి కేబినెట్‌లోకి తీసుకోవడమా.. లేక .. గౌతమ్‌ రెడ్డి సతీమణి శ్రీకీర్తిని రంగంలోకి దించి ఉప ఎన్నికల్లో భర్త గౌతమ్‌ రెడ్డి స్థానంలో ఆమెను గెలిపించుకుని పెద్దాయనకు ప్రభుత్వంలో కీలకమైన పదవి కట్టబెట్టేందుకు మరో ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదిఏమైనా ఆకుటుంబానికి ఏలోటు రాకుండా చూసుకోవడంతోపాటు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను పెంచేదిశగా సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారు.

జిల్లా నేతలతో సజ్జల భేటీ
వచ్చే నెల 3వ తేదీ దివంగత గౌతమ్‌ రెడ్డి ఉత్తర క్రియలు పూర్తికానున్నాయి. ఆతరువాత జిల్లా నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి భేటీ కానున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలతోపాటు మేకపాటి కుటుంబానికి జిల్లాలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ప్రాధాన్యత ఇచ్చే అన్ని అంశాలపై చర్చించి ఓ అభిప్రాయానికి రానున్నారు. జిల్లా నేతల అభిప్రాయాలను తీసుకోవడంలో భాగంగా ముందుగా ఎమ్మెల్యేలతోనూ, ఆతరువాత జిల్లా పార్టీలో కీలక నేతలతోనూ ఆయన విడివిడిగా భేటీ అయ్యి వారి అభిప్రాయన్ని తెలుసుకోనున్నారు. ఈ రెండు భేటీల అనంతరం మరోమారు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష నిర్వహించి తుది నిర్ణయానికి రానున్నారు. అదే అంశాన్ని సీఎం జగన్‌కు సజ్జల నివేదించనున్నారు.

2024 నాటికి వారసుడికి అవకాశం
2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దివంగత మేకపాటి గౌతమ్‌ రెడ్డి వారసుడు కృష్ణార్జున రెడ్డిని రంగంలోకి దింపే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు వయస్సు చిన్నది కావడం, ఆయన చదువులు కూడా మధ్యలో ఉన్న నేపథ్యంలో ఇప్పటి ఉప ఎన్నికల్లో భార్య శ్రీకీర్తికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆతరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణార్జున రెడ్డికి స్థానం కల్పించేందుకు సీఎం జగన్‌ మొగ్గు చూపుతున్నారు. అదేకనుక జరిగితే అత్యంత పిన్న వయస్సులో కృష్ణార్జున రెడ్డి శాసనసభకు ఎంపిక కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement