Monday, November 18, 2024

Delhi | నీ రెమ్యునరేషన్ ఎంత ‘బ్రో’.. దత్తపుత్రున్ని అంటే నీకెందుకు కోపం: మంత్రి రాంబాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నీతి నిజాయితీ-పారదర్శకత అని మాట్లాడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చెప్పగలరా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. పవన్‌ను ఏమైనా అంటే చంద్రబాబుకు కోపం వస్తోందని, వారిద్దరిదీ దత్తపుత్రుడు, దత్తత తండ్రి బంధం కాబట్టే ఆయనకు గుచ్చుకుంటోందని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాంబాబు గురువారం వైఎస్సార్సీపీ ఎంపీలు సత్యవతి, మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, నందిగం సురేష్, బెల్లాన చంద్రశేఖర్‌లతో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. పోలవరం నిర్మాణం, నిధులపై ఆయనతో చర్చించారు. అనంతరం రాంబాబు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, సురేష్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కొన్ని విషయాలను బహిర్గతం చేసేందుకు, మరికొన్నిటిని అంతర్గతంగా చర్చించేందుకు తాను ఢిల్లీ వచ్చానని చెప్పారు.

పోలవరం సందర్శనకు రావలసినదిగా షెకావత్‌ను ఆహ్వానించానని తెలిపారు. వీలు చూసుకుని పోలవరం పర్యటనకు వస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. విజయసాయి రెడ్డితో పాటు పలువురు వైసీపీ ఎంపీలను కలిసి వివిధ అంశాలపై చర్చించానని అంబటి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధానప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు రాయలసీమలో మాట్లాడుతూ తన స్థాయిని దిగజార్చుకున్నారని దుయ్యబట్టారు. మంత్రినైన తనను ఆంబోతు రాంబాబు అన్నారని చెప్పుకొచ్చారు. ఇరిగేషన్‌ రంగంపై అవగాహన లేకే బాబు విషయాలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును 2018కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని శాసనసభలో ప్రగల్బాలు పలికి ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వమే కట్టిస్తామన్న పోలవరం ప్రాజెక్టును ఎందు రాష్ట్ర ప్రభుత్వం టేకప్‌ చేసిందని నిలదీశారు. ప్రాజెక్టుకు వెన్నెముక వంటి కాఫర్‌డ్యామ్‌ నిర్మించకుండా డయాఫ్రం వాల్‌ ఎందుకు నిర్మించారని అంబటి అన్నారు. కనీసం రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేశావా అంటూ ప్రశ్నించారు. దివంగత ఎన్టీ రామారావు మద్రాసుకు నీళ్లు ఇచ్చే తెలుగు గంగ కోసం కేవలం 11.5 వేల క్యూసెక్కుల డిశ్చార్జి నీటితో పోతిరెడ్డిపాడును ప్రారంభిస్తే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ మొత్తానికి నీళ్లివ్వాలని లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకూ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లిచ్చిన చరిత్ర చంద్రబాబుదా? మహానేత వైఎస్‌ఆర్‌దా? అనేది సీమలో చిన్నపిల్లాణ్ని అడిగినా చెప్తారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఒక్క అడుగైనా ముందుకేయలేదని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు కూడా వైఎస్సార్‌ పుణ్యమేనని అన్నారు. కనీసం శంకుస్థాపన కూడా చేయని, ఒక్క రూపాయి కూడూ ఖర్చు పెట్టని చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్ట్ బిడ్డ ఎలా అవుతుందని అంబటి ప్రశ్నించారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నావని కేంద్రం నుంచి సర్టిఫికెట్‌ తెచ్చుకున్నావని బాబును ఎద్దేవా చేశారు. మైకు దొరికితే చాలు చంద్రబాబు అబద్ధాలకు అంతులేకుండా పోతుందని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆలోచన, ఆచరణ చేసిన గొప్ప నేతలెవరైనా ఉన్నారంటే, అది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీ రామారావు మాత్రమేనని నొక్కి చెప్పారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చంద్రబాబు తనను ఆంబోతంటున్నారని, బ్రో సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటున్నారని అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

- Advertisement -

తనను కించపరుస్తూ బ్రో సినిమాలో ఓ సీన్ పెట్టారు కాబట్టే తాను ఆ మూవీ గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేని పవన్ కళ్యాణ్ సినిమాలతో గిల్లుతున్నాడని అన్నారు. పవన్ కళ్యాణ్ నిజంగా నిజాయితీపరులైతే బ్రో సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అధికారికంగా తీసుకునేది కొంత, అనధికారికంగా తీసుకునేంది ఎంతోనని అన్నారు. అలాగే, అధికారికంగా పెళ్లి చేసుకుని కొందర్ని అయితే అనధికారికంగా ఎందరినో, అదే పవన్ కళ్యాణ్ జీవితమని విమర్శించారు. జనసేన పార్టీ రాజకీయాలు మానుకుని సినిమాలు తీస్తానంటే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ మీద తాను, తన మిత్ర బృందంతో కలిసి సినిమా తీద్దామనుకుంటున్నానని వివరించారు. తమకు పోటీగా జనసేన తీసే సినిమాలో అవసరమైతే డబ్బులు తీసుకుని పవన్‌కళ్యాణ్‌ నటించినా అభ్యంతరమేమీ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement