అమరావతి, ఆంధ్రప్రభ: భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించటం ద్వారానే నదుల అనుసంధానం సాధ్యమవుతుందనీ, ఆ దిశగా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ- స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాకు కీలక నివేదిక సమర్పించింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర జలవనరుల శాఖ ఎలాంటి నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టలేదని కూడా కమిటీ- వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రక్రియను నమూనాగా తీసుకుని ఇతర రాష్ట్రాల మధ్య ఏకాభి ప్రాయం సాధించాలని కమిటీ- వెల్లడించింది. పార్లమెంటు- సభ్యుడు పర్ భాత్ భాయ్ సవాభాయ్ పటేల్ అధ్యక్షతన 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో నదుల అనుసంధానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ- ఏర్పడింది. దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రతిపాదనలు, తుది ఆమోదాలు, అమలు, బడ్జెట్ కేటాయింపులు, పనుల పురోగతిపై అన్ని రాష్ట్రాల్లో పర్యటించి క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా కమిటీ- పార్లమెంటు-కు నివేదిక సమర్పించింది. నదుల అనుసంధానంపై చర్చల ప్రక్రియలో పురోగతి లేదని కమిటీ- వ్యాఖ్యానించటంపై కేంద్ర జలశక్తి స్పందించింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఇప్పటికే అనేక సార్లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించామనీ, రాష్ట్రాల అభిప్రాయాలను క్రోడీకరించి ప్రతిపాదనలు సిద్దం చేశామని వెల్లడించింది. ఆయా ప్రాంతాల సాగునీటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నదుల అనుసంధాన ప్రక్రియకు ఏదో ఒక రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించిన జలశక్తి గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఇదీ..అనుసంధాన ప్రణాళిక
రోజుకు 2.2 టీ-ఎంసీల చొప్పున 143 రోజుల్లో మొత్తంగా 247 టీ-ఎంసీల వరద నీటిని ఎత్తిపోసేలా గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డబ్ల్యూ) డిజైన్ చేసింది. తెలంగాణలోని ఇచ్చంపల్లి (గోదావరి) నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి నీటిని తరలించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించేలా ఎన్‌డబ్ల్యూడీఏ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపించింది. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీ-ఎంసీలు, చత్తీస్ ఘడ్‌లోని ఇంద్రావతి బేసిన్‌లో మిగులుగా ఉన్న 72 టీ-ఎంసీలు..మొత్తం 247 టీ-ఎంసీల తరలించాలనేది ఎన్‌డబ్ల్యూడీఏ ప్రణాళిక. ఎత్తిపోసి తరలించే నీటిలో ఏపీకి 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీ-ఎంసీలను ఇవ్వాలని ముసాయిదా డిజైన్‌ను రూపొందించారు. దీనిపై ఛత్తీస్‌గఢ్, కర్ణాటకతో పాటు- కేరళ, పాండిచ్చేరి, మహారాష్ట్రలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలకే కాకుండా తమకు కూడా కావేరికి మళ్లించే నీటిలో వాటా కావాలని కర్ణాటక డిమాండ్ చేస్తోంది. ఇంద్రావతిలో తమకు కేటాయించిన నీటిని వినియోగం కావటం లేదన్న సాకుతో కావేరికి మళ్లించటం ఏ మాత్రం హేతుబద్ధం కాదని చత్తీస్ గఢ్ వాదిస్తోంది. అసలు గోదావరిలో నీటి లభ్యతపై సాధికారికంగా లెక్కలు తేల్చకుండా అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుడితే తాము నష్టపోతామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చెబుతున్నాయి. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా లెక్కలు కడితే అసలు మిగులు జలాలే లేవనీ, ఈ విషయాన్ని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గతంలో అధికారికంగా వెల్లడించిన విషయాన్ని ఏపీ, తెలంగాణలు గుర్తు చేస్తున్నాయి. ఈ విషయాన్ని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ డిడబ్ల్యూ) పరిగణలోకి తీసుకోకుండానే అనుసంధాన ప్రక్రియను డిజైన్ చేయటం ఏ మాత్రం హేతుబద్ధంగా లేదని ఏపీ, తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాలు చెబుతున్నాయి.
కెన్-బెట్వా మార్గమే శిరోధార్యం
మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కెన్ -బెట్వా నదుల అనుసంధాన ప్రక్రియలో అనుసరించిన విధానాన్నే గోదావరి-కావేరితో సహా మిగిలిన రాష్ట్రాల్లో అనుసరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ- సూచించింది. దామన్‌గంగా-పింజల్-పార్-తాపి-నర్మద నదుల అనుసంధానం ద్వారా మహారాష్ట్ర-గుజరాత్‌లకూ, కెన్-బెట్వా అనుసంధానం ద్వారా ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లకూ, కోసి-మెచి ప్రాజెక్టు ద్వారా బీహార్‌కూ, గోదావరి(ఇచ్చంపల్లి)-కావేరి(గ్రాండ్ ఆనక) అనుసంధానం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు సాగు, తాగునీటి ప్రయోజనాలను కల్పించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో కెన్-బెట్వా అనుసంధానం ప్రక్రియ నిర్మాణ దశలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలతో విస్తృత ప్రాతిపదికన చర్చించి కెన్-బెట్వాలో అనుసరించిన విధానాలు అమలయ్యేలా అవసరమైన కార్యాచరణ ప్రారంభించాలని స్టాండింగ్ కమిటీ- కోరింది.