Friday, November 22, 2024

సేవలు అందించటంలో గృహనిర్మాణ శాఖ అగ్రస్థానం – మహమ్మద్ దివాన్

శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరకీ ఇళ్ళు పథకం లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 30లక్షల గృహనిర్మాణ పట్టాలు పంపిణీ చేశారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి గృహనిర్మాణ అధికారులు సమీక్షా సమావేశంలో కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్య సాధనలో వెనుకంజ వేసే సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గృహనిర్మాణ ప్రగతిలో శ్రీకాకుళం జిల్లా మూడవ స్థానంలో నిలిచిందన్నారు.

రాష్ట్రంలో గృహాలు లేని పేదలందరకీ గృహాలు మంజూరు చేశామని ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ చరిత్రలో ఒకేసారి 15వేల కోట్లతో ఇల్లు నిర్మించడం ఇదే ప్రదమమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు మంజూరైన 75, 840 గృహాల్లో 25వేల గృహాలు నిర్మాణం పూర్తి అయ్యాయని అన్నారు. వైస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పనకు 5వేల కోట్లు వ్యయం చేస్తున్నామని అన్నారు. పారదర్శకంగా సేవలు అందించటంలో గృహనిర్మాణ శాఖ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. అంతకంటే ముందు శ్రీకాకుళం జిల్లా సమీక్షలో కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తో కలిసి వివిధ మండలాల ప్రగతిని సమీక్షించారు.

కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మంజూరైన గృహాల నిర్మాణంలో గృహనిర్మాణ శాఖ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్.గణపతి, డ్వామా పీడీ చిట్టిరాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా అధికారులు ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ నాగేశ్వరరావు, అర్బన్ సహాయ ఇంజినీర్ గణేష్ ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement